Nuke Testings: మౌనం మిగిల్చిన విషం.. 40లక్షల మంది మృతి.. సంచలనం రేపుతున్న నివేదిక!
ఈ వార్తాకథనం ఏంటి
1945లో మొదటి అణు బాంబు పేలిన క్షణమే మానవ చరిత్రలో ఒక కనిపించని గాయం మొదలైంది. యుద్ధాలు ఆగాయి. ఒప్పందాలు కుదిరాయి. కానీ అణు పరీక్షలు వదిలిన విషం మాత్రం ఇప్పటికీ భూమిని విడిచిపెట్టలేదు. కాలంతో అది మాయం కాలేదు. మన శరీరాల్లోనే నిలిచిపోయింది. ఇప్పుడొక అంతర్జాతీయ నివేదిక ప్రపంచాన్ని ఉలిక్కిపడే నిజం చెప్పింది. 1945 నుంచి 2017 వరకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అణు పరీక్షల ప్రభావంతో కనీసం 40 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. ఇవి యుద్ధాల్లో మరణించిన సంఖ్యలు కావు. కనిపించని రేడియేషన్ వల్ల నెమ్మదిగా చనిపోయిన జీవితాలు.
Details
ఒక్క దేశానికే మాత్రమే పరిమితం కాలేదు
నిజానికి అణు పరీక్షలు కొన్ని దేశాల భూభాగాల్లో మాత్రమే జరిగాయి. కానీ వాటి ప్రభావం ఒక్క దేశానికి పరిమితం కాలేదు. ఈ భూమిపై జీవిస్తున్న ప్రతి మనిషి శరీరంలో ఆ పరీక్షల జాడలు ఉన్నాయని శాస్త్రం చెబుతోంది. అణు ఆయుధాలు అంటే ఇప్పటికీ చాలా మంది హిరోషిమా, నాగసాకి గురించే మాట్లాడుతుంటారు. కానీ నిజమైన విధ్వంసం యుద్ధంలో కాదు... శాంతి పేరుతో చేసిన పరీక్షల్లోనే జరిగింది. 1945 నుంచి 2017 మధ్య ప్రపంచవ్యాప్తంగా 2,400కు పైగా అణు పరికరాలు పేల్చారు. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా మాత్రమే కాదు... భారత్, పాకిస్తాన్ వంటి దేశాలూ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ పరీక్షల్లో ఎక్కువ భాగం భూవాతావరణంలోనే జరిగాయి.
Details
క్యాన్సర్, గుండె జబ్బులు వంటి సమస్యలు
ఆ పేలుళ్ల నుంచి వెలువడిన రేడియేషన్ ఆకాశంలోకి ఎగసి గాలితో కలిసి ఖండాలు దాటింది. సముద్రాల్లో కలిసింది. భూమిలోకి చొచ్చుకెళ్లింది. చివరకు మన ఆహారంలోకీ చేరింది. నార్వేజియన్ పీపుల్స్ ఎయిడ్ అనే మానవతా సంస్థ విడుదల చేసిన ఈ నివేదిక ఒక భయంకరమైన వాస్తవాన్ని బయటపెడుతోంది. అణు పరీక్షల వల్ల విడుదలైన అయానైజింగ్ రేడియేషన్ మన డీఎన్‌ఏను నేరుగా దెబ్బతీసిందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీని ఫలితంగా క్యాన్సర్లు, గుండె జబ్బులు, స్ట్రోక్‌లు, పుట్టుకలో లోపాలు విపరీతంగా పెరిగాయి. వాతావరణంలో జరిగిన అణు పరీక్షల కారణంగా మాత్రమే భవిష్యత్తులో 20 లక్షల క్యాన్సర్ మరణాలు, మరో 20 లక్షల గుండె సంబంధిత మరణాలు సంభవించే ప్రమాదం ఉందని నివేదిక అంచనా వేస్తోంది.
Details
శరీర లోపాలతో పిల్లలు జననం
రేడియేషన్‌కు సురక్షితమైన స్థాయి అనే మాటే లేదని సైన్స్ స్పష్టంగా చెబుతోంది. తక్కువ మోతాదులోనైనా ప్రభావం తప్పదన్నది నిపుణుల ఏకాభిప్రాయం. ముఖ్యంగా అణు పరీక్షలు జరిగిన ప్రాంతాల చుట్టుపక్కల నివసించిన ప్రజలే ఎక్కువ మూల్యం చెల్లించారు. ఫ్రెంచ్ పోలినీషియా, మార్షల్ దీవులు, కజకస్తాన్, అల్జీరియా వంటి ప్రాంతాల్లో తరతరాలుగా ప్రజలు అనారోగ్యాలతో జీవిస్తున్నారు. పిల్లలు పుట్టేలోపే శరీర లోపాలతో బాధపడుతున్నారు. మహిళలు, బాలికలు రేడియేషన్ కారణమైన క్యాన్సర్లకు పురుషులకంటే 52 శాతం ఎక్కువగా గురయ్యే ప్రమాదం ఉందని నివేదిక వెల్లడిస్తోంది. గర్భంలో ఉన్న శిశువులు, చిన్న పిల్లలు ఈ విషానికి అత్యంత ఎక్కువగా ప్రభావితమయ్యారు.
Details
ఇప్పటికీ పూర్తి నిజం బయటికి రాలేదు
ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే... ఈ పరీక్షలపై ఇప్పటికీ పూర్తి నిజం బయటకు రాలేదు. అనేక దేశాలు డేటాను గోప్యంగా ఉంచాయి. ఎక్కడ ఎంత రేడియేషన్ మిగిలిందో, ఏ ప్రాంతాలు ఇంకా ప్రమాదంలో ఉన్నాయో వెల్లడించడం లేదు. బాధితులకు సరైన వైద్యం లేదు. రెగ్యులర్ స్క్రీనింగ్ లేదు. నష్టపరిహారం పేరుతో తీసుకొచ్చిన పథకాలు కూడా బాధితులను ఆదుకునేలా కాకుండా ప్రభుత్వాల బాధ్యతను తగ్గించేలా ఉన్నాయని నివేదిక తీవ్రంగా విమర్శిస్తోంది. ఇప్పటివరకు ఒక్క అణుశక్తి దేశం కూడా ఈ పరీక్షల కోసం బహిరంగంగా క్షమాపణ చెప్పలేదు. దేశ భద్రత పేరుతో అణు పరీక్షలను సమర్థించుకుంటున్నారు.
Details
తరతరాల పాటు దాని ప్రభావం
కానీ ఈ నివేదిక చెబుతున్న కథ వేరే. ఇది భద్రత కాదు. ఇది నెమ్మదిగా సాగిన మానవ హత్య. యుద్ధం లేకుండానే కోట్లాది ప్రాణాలు తీసిన విధ్వంసం. అణు బాంబు పేలుడు ఒక క్షణం మాత్రమే కనిపిస్తుంది. కానీ దాని ప్రభావం తరతరాల పాటు కొనసాగుతుంది. ప్రపంచం మరోసారి అణు పరీక్షల మాట మాట్లాడుతున్న వేళ... ఈ నివేదిక ఒక తీవ్రమైన హెచ్చరిక. గతం మిగిల్చిన విషం ఇంకా మన శరీరాల్లోనే ఉంది. దాన్ని మరిచి మళ్లీ అదే దారిని ఎంచుకుంటే, రానున్న తరాలు మరింత భారీ మూల్యం చెల్లించాల్సి రావడం ఖాయం.