LOADING...
Fever: మెలియాయిడోసిస్‌ ముప్పు.. ఆలస్యం చేస్తే ప్రాణాపాయం!
మెలియాయిడోసిస్‌ ముప్పు.. ఆలస్యం చేస్తే ప్రాణాపాయం!

Fever: మెలియాయిడోసిస్‌ ముప్పు.. ఆలస్యం చేస్తే ప్రాణాపాయం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 26, 2025
12:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

తురకపాలేని గ్రామానికి చెందిన వెంకట్రావు (48) గత 45 రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది, కీళ్ల నొప్పులు, దగ్గు వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. ఆయన ఊపిరితిత్తుల్లో నెమ్ము, కామెర్లు ఉన్నాయని వైద్యులు గుర్తించి చికిత్స అందించినప్పటికీ జ్వరం తగ్గలేదు. పలు ఆసుపత్రుల్లో తిరిగిన తర్వాత బ్లడ్‌ కల్చర్‌ పరీక్షలు నిర్వహించగా, ఆయనకు 'బర్కోల్డేరియా సూడోమాలీ' అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే ప్రమాదకర ఇన్ఫెక్షన్‌ 'మెలియాయిడోసిస్‌' అని నిర్ధారణైంది. సరైన యాంటీబయాటిక్స్‌ చికిత్స అందించడంతో చివరికి ఆయన కోలుకున్నారు. గుంటూరుకు చెందిన ఇబ్రహీం (65) ఆక్సిజన్‌ తగ్గి, తీవ్రమైన ఆయాసంతో ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో చేర్చిన వైద్యులు సీటీ స్కాన్‌ చేయగా కడుపులో గడ్డ ఉన్నట్లు గుర్తించారు.

Details

మెలియాయిడోసిస్‌ నిర్ధారణ

ఆ గడ్డ క్యాన్సరా? కాదా? అని ముక్క తీసి పరీక్షించాలనుకున్నారు. అయితే అదే సమయంలో చేసిన బ్లడ్‌ కల్చర్‌ పరీక్షలో ఆయనకు కూడా మెలియాయిడోసిస్‌ ఉన్నట్లు తేలింది. వర్షాకాలంలో సాధారణంగా వైరల్‌ ఫీవర్స్‌, డెంగీ, మలేరియా, స్క్రబ్‌ టైఫస్‌ లాంటి వ్యాధులు విస్తరిస్తాయి. కానీ కొందరికి డెంగీ, మలేరియా లాంటివి కాకుండా జ్వరం దీర్ఘకాలం కొనసాగడం, కీలక అవయవాలను ప్రభావితం చేయడం ప్రత్యేక లక్షణాలుగా వైద్యులు గుర్తిస్తున్నారు. ఇటీవల దీర్ఘకాలిక జ్వరం, ప్రాణాపాయ పరిస్థితితో నలుగురు రోగులు ఆసుపత్రికి రాగా, వీరికి బ్లడ్‌ కల్చర్‌ ద్వారా మెలియాయిడోసిస్‌ అని తేలిందని గుంటూరు శ్రీ ఆసుపత్రి ఇన్‌ఫెక్షియస్‌ డిసీజ్‌ నిపుణుడు డాక్టర్‌ కల్యాణ చక్రవర్తి వెల్లడించారు.

Details

 సకాలంలో గుర్తిస్తే నయం చేయవచ్చు

ఈ వ్యాధి బర్కోల్డేరియా సూడోమాలీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందని, సకాలంలో గుర్తిస్తే యాంటీబయాటిక్స్‌తో సులభంగా నయం చేయవచ్చని ఆయన తెలిపారు. ఆలస్యమైతే కీలక అవయవాలు తీవ్రంగా దెబ్బతిని, ఖరీదైన చికిత్సలు ఇచ్చినా ఫలితం ఉండకపోవచ్చన్నారు. జ్వరం, దగ్గు, కీళ్ల నొప్పులు ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు అని చెప్పారు. అలాగే తేమ ఎక్కువగా ఉండే నేలల్లో ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి కాళ్లపై పుండ్లు రావడం, చెప్పులు లేకుండా నడిచే అలవాటు వల్ల ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే అవకాశం అధికమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధిని తొలిదశలో గుర్తించడం అత్యంత కీలకమని నిపుణులు సూచిస్తున్నారు.