Destination Wedding: విదేశాల్లోనే కాదు.. భారతదేశంలోనూ డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు అపార అవకాశాలు!
ఈ వార్తాకథనం ఏంటి
వివాహం అనేది జీవితంలో మరపురాని, అత్యంత మధురమైన ఘట్టం. ఆ ప్రత్యేక క్షణాలు జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండాలని ప్రతి వధూవరుల ఆకాంక్ష. ఇదే కోరికతో ఇటీవల కాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది. నాలుగు రోజుల పాటు నచ్చిన ప్రదేశంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య వివాహ వేడుకలు నిర్వహించి తిరిగి ఇంటికి చేరే విధానం ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉంది. సంపన్న వర్గాలు విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ నిర్వహిస్తున్నప్పటికీ, మన దేశంలోనూ అదే స్థాయిలో అద్భుతమైన ప్రదేశాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఎగువ మధ్య తరగతి, మధ్య తరగతి కుటుంబాల బడ్జెట్‌కు తగ్గట్టుగా కూడా అనేక వివాహ వేదికలు లభిస్తున్నాయి. మరి అలాంటి ప్రాంతాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
Details
రాచరిక వైభవం
రాజుల కాలం నాటి వైభవాన్ని తలపించేలా, కోటల్లో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోవాలనుకునే వారికి రాజస్థాన్ ఉత్తమ ఎంపిక. సరస్సులు, రాజభవనాలకు ప్రసిద్ధి చెందిన ఉదయ్‌పూర్ లో సిటీ ప్యాలెస్, లేక్ ప్యాలెస్, ఒబెరాయ్ ఉదయ్ విలాస్ వంటి అద్భుత వేదికలు ఉన్నాయి. జైపూర్ లో అంబర్ ఫోర్ట్, జై మహల్, రాంబాగ్ ప్యాలెస్ వంటి చారిత్రక కట్టడాలు వివాహ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అలాగే జోధ్‌పూర్ లో ఉమైద్ భవన్ ప్యాలెస్, మెహ్రాన్‌గఢ్, ఫోర్ట్ ఖజెర్లా వంటి వేదికలు కూడా అందుబాటులో ఉన్నాయి.
Details
బీచ్ వెడ్డింగ్
సముద్ర అలల సవ్వడి మధ్య, సూర్యోదయం లేదా సూర్యాస్తమయం వేళ ప్రకృతి ఒడిలో వివాహం చేసుకోవాలనుకునే వారు గోవా, కేరళ, అండమాన్-నికోబార్ దీవులు ఎంచుకోవచ్చు. గోవాలో అనేక హోటల్స్, రిసార్ట్స్ సముద్ర తీరాన బీచ్ సెట్టింగ్‌తో వివాహ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాయి. హడావుడి లేకుండా, నిశ్శబ్ద వాతావరణంలో సన్నిహితుల మధ్య వివాహం జరపాలనుకునే వారికి అండమాన్-నికోబార్ అద్భుతమైన ఎంపిక. బీచ్ వెడ్డింగ్‌తో పాటు అండర్‌వాటర్ రింగ్ ఎక్స్ఛేంజ్ వంటి ప్రత్యేక అనుభూతులు అక్కడ లభిస్తాయి. కేరళలో బ్యాక్‌వాటర్ హౌస్‌బోట్స్‌లో వివాహాలు నిర్వహించుకోవడం కొంతమందికి ప్రత్యేక ఆకర్షణగా మారింది.
Details
కొండల మధ్య కళ్యాణం
అలాంటి వారికి అలపుళా బెస్ట్. మున్నార్‌లో టీ గార్డెన్స్, కొండల మధ్య చల్లని వాతావరణంలో వివాహం చేసుకోవచ్చు. కోవళంలో బీచ్ సెట్టింగ్ వెడ్డింగ్స్ జరగగా, ఫారెస్ట్ థీమ్ కావాలంటే వయనాడ్ సరైన ఎంపిక. పచ్చని కొండలు, మబ్బుల మధ్య రొమాంటిక్ వాతావరణంలో వివాహం జరపాలనుకునే వారు ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీ, తమిళనాడులోని ఊటీ, హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా, మనాలి ప్రాంతాలను ఎంచుకోవచ్చు. ప్రకృతి ప్రేమికులు ఎక్కువగా ఈ హిల్ స్టేషన్లలో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ఆసక్తి చూపుతున్నారు. ముస్సోరీలోని ప్రకృతి అందాలు, చల్లని వాతావరణం పెళ్లికి ప్రత్యేక ఆకర్షణనిస్తాయి. ఊటీలో టీ గార్డెన్స్ మధ్య జరిగే వివాహం ప్రకృతి ఒడిలో జరిగిన అనుభూతిని కలిగిస్తుంది. సిమ్లా, మనాలిలోని పర్వత సౌందర్యం పెళ్లి వేడుకలకు అదనపు హంగును తెచ్చిపెడుతుంది.
Details
చారిత్రక వేదికలు
భారతీయ చరిత్ర, కళా వారసత్వాన్ని ప్రతిబింబించే డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కూ మంచి డిమాండ్ ఉంది. కర్ణాటకలోని హంపీలో పురాతన ఆలయాలు, శిల్పకళతో కూడిన వేదికలు వివాహాలకు ప్రత్యేకతను ఇస్తాయి. మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో చారిత్రక కట్టడాల మధ్య పెళ్లి జరుపుకోవడం ఒక అరుదైన అనుభూతి. అలాగే మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో ఎల్లోరా, అజంతా గుహల దగ్గర ఉన్న కొన్ని రిసార్ట్స్ హెరిటేజ్ వెడ్డింగ్స్‌ను అందిస్తున్నాయి.
Details
ఖర్చు & ప్రణాళిక
డెస్టినేషన్ వెడ్డింగ్‌కు అయ్యే ఖర్చు ఎంపిక చేసుకునే ప్రదేశం, అతిథుల సంఖ్య, వెడ్డింగ్ థీమ్‌పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మిడ్ రేంజ్‌లో రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు కావచ్చు. ఆధ్యాత్మిక క్షేత్రాల్లో నిర్వహించే వివాహాలకు ఖర్చు తక్కువగా ఉంటుంది. వెడ్డింగ్ సీజన్‌లో ఈ ప్రదేశాలకు భారీ డిమాండ్ ఉండటంతో ముందుగానే పూర్తి వివరాలు తెలుసుకొని, సరైన ప్రణాళికతో బుకింగ్ చేసుకోవడం ఉత్తమం.