ప్రేరణ: ఒడిపోయారా? ఐతే మీకు సక్సెస్ వచ్చి తీరుతుంది
పరీక్షలో ఫెయిల్ అయ్యారా? బాధపడకండి, బిజినెస్ చేయాలనుకుంటే మొదటి అడుగులోనే పట్టుతప్పి కిందపడ్డారా? చింతించకండి, సినిమా తీద్దామని ముందుకెళ్తుంటే ఒక్కరు కూడా మీ కథను ఒప్పుకోవట్లేదా? ఆందోళన పడకండి. ఎందుకంటారా? మీకు మరికొన్ని రోజుల్లో సక్సెస్ లభించబోతుంది, అందుకే మీకిప్పుదు ఓటమి దక్కుతోంది. అదేంటని ఆలోచిస్తున్నారా? అదే మరి. విజయం గురించి సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళు ఓటమి గురించి ఎక్కువ బాధపడరు. విజయం అనేది అమాంతం వచ్చిపడదు. దానికోసం మీరు చాలా ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణంలో మీకు అడుగడుగునా ఓటములు ఎదురవుతాయి. ఆ ఓటములన్నీ కూడి విజయమనే బహుమతిని మీకందిస్తాయి. విజయం వచ్చేదాకా ఎన్ని ఓటములైనా రానివ్వండి. మీరు మాత్రం నిరాశ పడకుండా విజయం వైపే అడుగులు వేయండి.
ఓటమి పొందిన వాళ్లే విజయానికి దగ్గరలో ఉంటారు
ఓటమి వచ్చినపుడు విజయం చాలా దూరంలో ఉన్నట్టుగా కనబడుతుంది. కానీ అది చాలా దగ్గరలో ఉంటుంది. అసలు ఎలా ఓడిపోయారో, ఎందుకు ఓడిపోయారో తెలుసుకుంటే గెలవడానికి ఏం చేయాలో అర్థమవుతుంది. అంటే మీరు విజయానికి దగ్గరగా ఉన్నట్టా కాదా మీరే అర్థం చేసుకోండి. ఓటమి నుండి పాఠం నేర్చుకున్నాక కూడా మళ్ళీ ఓడిపోతున్నారా? అయినా బాధపడవద్దు. ఈసారి విజయానికి ఇంకా దగ్గరికి వచ్చేసారన్న మాట. ఈసారి ఇంకా గట్టిగా ప్రయత్నించండి, ఖచ్చితంగా విజయం వచ్చి తీరుతుంది. అందుకే ఓటమికి బాధపడాల్సిన పనేమీ లేదు. అలా అని ఓటమి నుండి ఏమీ నేర్చుకోకుండా మొదటి సారి చేసిన తప్పే రెండోసారి చేస్తే మీకు విజయం ఎప్పటికీ దక్కదు.