Trust Issues: ఇలా చేస్తే మీ భాగస్వామి పట్ల అనుమానం పోయి, నమ్మకం పెరుగుతుంది
నమ్మకం లేకుండా ఏ బంధం కూడా కొనసాగదు. రోజూవారి జీవన విధానంలో కుటుంబ కలహాలు, మనస్పర్థలు, ఇలా రకరకాల కారణాల వల్ల భాగస్వామి పట్ల విశ్వాసం సన్నగిల్లి, బంధం బలహీన పడుతుంది. గొడవలు సద్దుమణిగిన తర్వాత పాత కాలపు ఆప్యాయతలు కనపడవు. గతంలో జరిగిన మనస్ఫర్థలే గుర్తుకొస్తాయి. అయితే అలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు ఇలా చేస్తే సరిపోతుంది. భాగస్వామి పట్ల నమ్మకం పెరగాలంటే ఎలాంటి విషయం అయినా మనసు విప్పి మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. మీ భాగస్వామి కార్యకలాపాలను పర్యవేక్షించడం ఆపివేయండి. వారిని అనుమానంతో చూడకండి. మీ భాగస్వామి మిమ్మల్ని విడిచిపెడతారనే భయాన్ని మీ ఆలోచనలోంచి తీసేయండి. మీ బలాలు, బలహీనతలను గుర్తించండి. మీకున్న బలాల ద్వారా మీ ఆత్మగౌరవాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి.
రహస్యాలను పంచుకోవడానికి ప్రయత్నించండి
రిలేషన్‌షిప్ లేదా కుటుంబంలో గత అనుభవం మీ ప్రస్తుత బంధాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ సంఘటన మీ భాగస్వామి పట్ల నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది. అయితే గత అనుభవాలకు మీ ప్రస్తుత భాగస్వామి కారణం కాదనే విషయాన్ని మీరు గుర్తించాలి. గతం నుంచి బయటికి వచ్చి, ప్రస్తుత భాగస్వామిని విశ్వసించడానికి ప్రయత్నించండి. బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి, నమ్మకాన్ని పెంపొందించడానికి ఒకరితో ఒకరు కొన్ని రహస్యాలను పంచుకోవడానికి ప్రయత్నించండి. మీ భాగస్వామి మీ పట్ల ఎంత ప్రేమను కలిగి ఉన్నారో గ్రహించండి. ఇన్నిరకాల ప్రయత్నాలు చేసిన మీ భాగస్వామి పట్ల మీ పవర్తన తీరు ఏ మాత్రం మారకపోతే.. సంబంధిత డాక్టర్‌ను సంప్రదించి, సరైన చికిత్స తీసుకోవడం మంచిది.