నోరూరించే వెజ్ కుర్మాలను మీ ఇంట్లో ట్రై చేయండి
కుర్మా వంటకాలు అంటే అందరికీ నోరూరుతాయి. కూరగాయలు, మసాలాలు, పెరుగు కాంబినేషన్లో వీట్ని తయారు చేస్తారు.రోటీ లేదా పరాటా, చపాతీతో ఆస్వాదించే రుచికరమైన వెజ్ కుర్మాలను ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. పన్నీర్ కుర్మా టమోటా ముక్కలు, ఎండు మిరపకాయలు,ఉల్లిపాయలు,లవంగాలు,అల్లం,దాల్చిన చెక్క, వెల్లుల్లితో పాటు మసలా దినుసులను పాన్‌లో వేయించాలి. తర్వాత ఆయా మిశ్రమాలను కలపి, వాటిని బాగా ఉడికించాలి. కడాయిలో పనీర్ ముక్కలను ఫ్రై చేయాలి. కారం, ధనియాల పొడి, ఉప్పు, మిరియాలు, పెరుగు వేసి బాగా ఉడికిస్తే గ్రేవీ వస్తుంది. తర్వాత పన్నీర్ ముక్కలను వేసి మళ్లీ ఉడికించి వేయించిన ఉల్లిపాయలతో కలిపితే వేడి వేడి పన్నీర్ కర్రీ రెఢీ అవుతుంది.
ఘుమఘుమలాడే నవ్రత్తన్ కుర్మా
నవ్రత్తన్ కుర్మా ముందుగా బాదం పప్పులను కొబ్బరి పాలలో నానబెట్టాలి. తర్వాత ఉల్లిపాయ ముద్దను నూరి, దాన్ని నెయ్యిలో బ్రౌన్ కలర్ లోకి వచ్చేవరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి బాగా కలపాలి. ఆ విమశ్రంలో కారం పొడి, ఉప్పు తగినంత తీసుకుని క్యారెట్, పచ్చి బఠానీలు, బంగాళదుంపలు, బీన్స్, బెల్ పెప్పర్స్, క్యాలీఫ్లవర్, సొరకాయలకు బాగా పట్టేదాకా వేయించాలి. ఇందులోకి కద్దిగా కొబ్బరి పాల మిశ్రమాన్ని కలిపి రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత కొబ్బరి పాలలో నానబెట్టిన బాదం, కొత్తిమీర తరుగును వేసి లైట్ గా గార్నిష్ చేసుకోవాలి. దీంతో ఘుమఘుమలాడే నవ్రత్తన్ కుర్మా రెడీ.
నాన్ లేదా పరాటాతో గరం గరం ఆలూ కుర్మా
ఆలూ కుర్మా ఎండు మిరపకాయలు, గసగసాలు, జీలకర్ర, కొత్తిమీరను వేయించి బాగా రుబ్బుకోవాలి. తర్వాత మసాలా దినుసులైన దాల్చిన చెక్క, సుగంధ ద్రవ్యాలైన యాలకులు, లవంగాలను కడాయిలో చక్కగా వేయించుకోవాలి. అనంతరం విడిగా ఉల్లిపాయలు, ఉప్పు, సరిపడినంత అల్లం, వెల్లుల్లి పేస్ట్, తరిగిన బంగాళా దుంపలకు బాగా మసాలా పట్టించాలి. తర్వాత బాగా ఉడికించాలి. ఆ మిశ్రమానికి పెరుగు, కొబ్బరి పాలు, జీడిపప్పు వేసి బాగా కలపాలి. దీంతో ఆలూ కుర్మా రెఢీ అయినట్లే. దీన్ని నాన్ లేదా పరాటాతో గరం గరం వడ్డించుకుని ఓ పట్టు పట్టొచ్చు.
రోజ్ వాటర్ కాంబినేషన్‌లో కథల్ కుర్మా
కథల్ కుర్మా జీడిపప్పు, బాదంపప్పు, పెరుగును మెత్తగా పేస్ట్‌గా కలిపాలి. దాల్చిన చెక్క, యాలకులను నెయ్యితో వేయించాలి. తర్వాత జాక్‌ఫ్రూట్ ముక్కలు,అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించాలి. జీలకర్ర, ధనియాలు, పసుపు పొడులకు కారం వేసి కలపాలి.పెరుగు-బాదం పేస్ట్, ఉల్లిపాయల పేస్ట్ లో నీరు పోసి కుక్కర్‌లో పెట్టాలి. తర్వాత రోజ్ వాటర్‌తో కలుపుతూ వేడిగా సర్వ్ చేసుకోవాలి. బీట్‌రూట్ కుర్మా బీట్‌రూట్ ముక్కలను కుక్కర్‌లో వేసి 3విజిల్స్ పెట్టాలి. ఉప్పు,చనా పప్పు, తురిమిన కొబ్బరి, పచ్చి మిర్చి పేస్ట్ రుబ్బుకోవాలి. యాలకులు,లవంగాలు, దాల్చినచెక్కతో వేయించి ఉల్లిపాయలు, టొమాటోలు, ఉప్పు, గరం మసాలాలు, అల్లం-వెల్లుల్లి పేస్టుతో కారం వేసి ఉడికించాలి. బీట్‌రూట్, కొబ్బరి ముద్ద వేసి ఉడికించుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి.