Page Loader
World Tuberculosis day 2025: క్షయవ్యాధి.. కారణాలు, లక్షణాలు, చికిత్స, నివారణ
క్షయవ్యాధి.. కారణాలు, లక్షణాలు, చికిత్స, నివారణ

World Tuberculosis day 2025: క్షయవ్యాధి.. కారణాలు, లక్షణాలు, చికిత్స, నివారణ

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 24, 2025
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

క్షయవ్యాధి (టీబీ) ఒక తీవ్రమైన వ్యాధి. అయితే, దీని లక్షణాల గురించి చాలా మందికి సరైన అవగాహన ఉండదు. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించకపోతే, అది ప్రాణాంతకంగా మారవచ్చు. అందుకే, ఈ వ్యాధిపై ప్రజలకు చైతన్యం కల్పించేందుకు ప్రతి సంవత్సరం మార్చి 24న ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం నిర్వహిస్తారు. సరైన సమయంలో చికిత్స ప్రారంభిస్తే, రోగి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.

వివరాలు 

టీబీ లక్షణాలు 

టీబీ వ్యాధి కొందరిలో చురుకుగా (Active TB) కనిపిస్తే,మరికొందరిలో స్వాపతికంగా (Latent TB) ఉంటుంది. స్వాపతిక టీబీ ఉన్నవారిలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు,కానీ కొన్ని పరీక్షల్లో వ్యాధి ఉనికిని గుర్తించవచ్చు. అయితే, చురుకుగా ఉన్న టీబీ త్వరగా వ్యాపించి, ఊపిరితిత్తులను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి ఒక్కసారిగా పెరగదు, అది కొన్ని వారాల నుంచి నెలల వరకు మెల్లగా అభివృద్ధి చెందుతుంది. టీబీ ప్రధాన లక్షణాలు రాత్రివేళ అధికంగా చెమటలు వస్తాయి, జ్వరం వదిలిపోతూ ఉంటుంది. శరీర బరువు తగ్గిపోవడం, ఆకలి మందగించడం. నిరంతర అలసటగా అనిపిస్తుంది. బలహీనతగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి. రక్తం, శ్లేష్మం కలిసి దగ్గు రావడం, దీర్ఘకాలిక దగ్గు ఉండడం.

వివరాలు 

టీబీ ప్రారంభ లక్షణాలు ఏమిటి? 

టీబీ ప్రారంభంలో నిరంతర దగ్గు, తక్కువ స్థాయిలో జ్వరం, రాత్రి చెమటలు, బరువు తగ్గడం, మరియు అలసట కనిపిస్తాయి. ఈ లక్షణాలు రెండు వారాల కంటే ఎక్కువ రోజులు ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. టీబీ నయం అవుతుందా? అవును, టీబీకి పూర్తి స్థాయి చికిత్స అందుబాటులో ఉంది. యాంటీబయాటిక్స్‌ను వైద్యుల సూచన ప్రకారం పూర్తిగా వినియోగించాలి. ట్రీట్మెంట్ మధ్యలో నిలిపివేస్తే, అది మళ్లీ ముదిరే ప్రమాదం ఉంది.

వివరాలు 

టీబీ ఇన్ఫెక్షన్.. వ్యాధి మధ్య తేడా 

టీబీ ఇన్ఫెక్షన్: రోగి శరీరంలో బ్యాక్టీరియా ఉన్నప్పటికీ, అది క్రియాశీలంగా ఉండదు. ఇలాంటి వ్యక్తులు ఇతరులకు వ్యాప్తి చేయరు. టీబీ వ్యాధి: ఇది క్రియాశీలంగా మారినప్పుడు, ఇతరులకు సోకే అవకాశముంది. టీబీ ఎక్కువగా ఎవరికీ వస్తుంది? రోగనిరోధక శక్తి బలహీనమైన వ్యక్తులకు (ఉదాహరణకు హెచ్ఐవి బాధితులు, మధుమేహం ఉన్నవారు). టీబీ రోగులతో ఎక్కువ సమయం గడిపేవారికి. పిల్లలు, వృద్ధులు, వీరి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. పోషకాహార లోపం, మద్యపానం, పొగ త్రాగడం వంటి అలవాట్లు ఉన్నవారికి. ముఖ్య సూచన: మీరు లేదా మీ కుటుంబసభ్యుల్లో ఎవరైనా పై లక్షణాలను అనుభవిస్తే, ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించండి.