Year Ender 2024: ఈ ఏడాది మరచిపోలేని విషాద ఘటనలివే!
కొత్త ఏడాది (2025)కి అడుగుపెట్టేందుకు మనమంతా సిద్ధమవుతున్న ఈ తరుణంలో మనస్సు కొత్త ఆశలతో నిండిపోతుంది. అదే సమయంలో పాత జ్ఞాపకాలు కూడా గుర్తుకొస్తాయి. 2024లో దేశంలో పలు విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. వాటిలో ఐదు ఘోర సంఘటనలు భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఆ ఘటనలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. 1. రాజ్‌కోట్ గేమింగ్ జోన్ అగ్నిప్రమాదం 2024, మే 25న గుజరాత్‌లోని రాజ్‌కోట్ గేమింగ్ జోన్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం 24 మందిని బలితీసుకుంది. మృతుల్లో 12 మంది చిన్నారులున్నారు. సౌరాష్ట్రలోని అతిపెద్ద గేమింగ్ జోన్‌గా పేరొందిన ఈ ప్రదేశం నిబంధనలను పాటించకపోవడం ప్రమాదానికి కారణమైంది.
2. హత్రాస్ తొక్కిసలాట
2024, జూలై 2న యూపీలోని హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాట పెను విషాదంగా మారింది. సింకదారావు గ్రామంలో జరిగిన సత్సంగం తర్వాత భక్తులు భోలే బాబా పాదాలను తాకడానికి కిలోమీటర్ల కొద్ది తరలివచ్చారు. జనం తాకిడిలో తొక్కిసలాట జరిగి 121 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది నిందితులపై కేసు నమోదు చేసినప్పటికీ భోలే బాబా అలియాస్ సూరజ్‌పాల్‌ను నిందితుల జాబితాలో చేర్చకపోవడంపై భిన్నభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 3. వయనాడ్ కొండచరియల విపత్తు 2024, జూలై 30న కేరళలోని వయనాడ్ ఘోర ప్రకృతి విపత్తుకు సాక్ష్యమైంది. కొండచరియలు విరిగిపడటంతో వందలాది మంది మృత్యువాత పడ్డారు. 180 మంది గల్లంతయ్యారు. ఈ విపత్తు దేశవ్యాప్తంగా ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
4. ఝాన్సీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం
2024, నవంబర్ 15న ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ మెడికల్ కాలేజీ నియోనాటల్ ఐసీయూలో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 18 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోగా, 16 మంది గాయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినా, ఆసుపత్రి నిర్వాహకుల నిర్లక్ష్యంతో ప్రమాదం మరింత పెరిగింది. ఈ ఘటన తర్వాత ఆసుపత్రి ప్రిన్సిపల్‌ను తొలగించి, మరికొందరిని సస్పెండ్ చేశారు. 5. జైపూర్ ట్యాంకర్ పేలుడు 2024, డిసెంబర్ 20న రాజస్థాన్‌లోని జైపూర్ అజ్మీర్ రోడ్డులో ఎల్‌పీజీ ట్యాంకర్‌తో కంటైనర్ లారీ ఢీకొనడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. పేలుడుతో 40 వాహనాలు దగ్ధమయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు విచారణలో తేలింది.