ఖైరతాబాద్ గణేష్ 2023: 63అడుగుల ఎత్తుతో శ్రీ దశమహా విద్యా గణపతిగా దర్శనం
హైదరాబాద్ లో వినాయక చవితి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. చవితి రోజు నుండి మొదలుకొని నిమజ్జనం జరిగే వరకు సిటీ మొత్తం పండగ వాతావరణంతో నిండిపోతుంది. హైదరాబాద్ లో గణేష్ పండగ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేషుడు. ప్రతీ సంవత్సరం ఖైరతాబాద్ గణేషుడి ఎత్తును ఒక అడుగు పెంచుతారు. ప్రస్తుతం ఈ వినాయకుడి విశేషాలు తెలుసుకుందాం. ఖైరతాబాద్ గణేషుడిని మొదటిసారిగా 1954సంవత్సరంలో ప్రారంభించారు. ఆ తర్వాత ఒక్కో సంవత్సరం ఒక్కో అడుగు పెంచుతూ ఈసారి 63అడుగుల గణపతిని తయారు చేశారు. ప్రతీ సంవత్సరం ఈ గణపతిని ఏదో ఒక రూపంతో కొలుస్తూ ఉంటారు. ఈసారి శ్రీ దశమహా విద్యాగణపతిగా కొలుస్తున్నారు.
మట్టితో తయారైన ఖైరతాబాద్ గణేషుడు
పర్యావరణ సంరక్షణ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మహాగణపతిని మట్టితో తయారుచేస్తారు. మహాగణపతి విగ్రహానికి ఎడమవైపున శ్రీ వీరభద్ర స్వామి విగ్రహం ఉండనుంది. అలాగే కుడివైపున శ్రీ పంచముఖ లక్ష్మీనరసింహస్వామి విగ్రహం కనిపించనుంది. అన్ని విగ్రహాలను కూడా మట్టితోనే తయారు చేస్తున్నారు. తాపేశ్వరం లడ్డు 63అడుగుల భారీ వినాయకుడి చేతిలో భారీ లడ్డు ఉండాల్సిందే. ఖైరతాబాద్ గణేషుడి చేతిలో ఉండే లడ్డూకి ఎంతో పేరుంది. గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లోని తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ ఖైరతాబాద్ గణేషుడికి లడ్డూ సమర్పిస్తున్నారు. ఈసారి కూడా లడ్డును సురుచి ఫుడ్స్ అందిస్తుంది. చవితి రోజు నుండి 11రోజులపాటు వినాయకుడు పూజలు అందుకుంటాడు. ఆ తర్వాత మహాగణపతిని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తారు.