Viswanatha Satyanarayana: తెలుగు సాహిత్య చరిత్రలో అద్భుత అధ్యాయం.. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ
తెలుగులో జ్ఞానపీఠ అవార్డుపొందిన ప్రథమవ్యక్తి కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. ఈయన కృష్ణాజిల్లా నందమూరు గ్రామంలో జన్మించారు. తండ్రి శోభనాద్రి, తల్లి పార్వతమ్మ. ఈయనకు బందరు హైస్కూలులో చెళ్లపిళ్ళ వేంకటశాస్త్రి తెలుగు ఉపాధ్యాయుడుగా ఉన్నారు. ఈయన కొంతకాలం అదే హైస్కూల్లో ఉపాధ్యాయునిగా కూడా పనిచేశారు. విశ్వనాథ వారు సంస్కృత, ఆంగ్లభాషలపై పట్టుసాధించారు. ఉద్యోగం చేస్తూనే మద్రాసు విశ్వవిద్యాలయం నుండి M.A. పట్టాపొందారు. ఈయన నేషనల్ (కృష్ణాజిల్లా), ఎ.సి., హిందూ (గుంటూరు), యస్.ఆర్.ఆర్. డిగ్రీ కళాశాల (కరీంనగర్) కళాశాలల్లో ప్రిన్సిపాల్ గా పనిచేశారు. సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులుగా, శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు. ఈయన కావ్యం, గేయం, నవల, కథ, వ్యాసం, నాటకం, విమర్శ, శతకంవంటి విభిన్న ప్రక్రియల్లో రచనలు చేపట్టారు.
1971లో జ్ఞానపీఠ పురస్కారం
లెక్కకు మించి గ్రంథాలకు పీఠికలు రాసిన ఈయనను కేంద్రప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతోటి సత్కరించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటుతోటి సన్మానించింది. ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా ఉన్నాడు. ఈయన రచనల్లో ప్రత్యేకంగా చెప్పుకోవలసినవి ఆంధ్రపౌరుషం, ఆంధ్రప్రశస్తి, శ్రీమద్రామాయణ కల్పవృక్షం, వేయిపడగలు, విశ్వనాథ మధ్యాక్కరలు, కిన్నెరసానిపాటలు మొదలయినవి. వీటిలో 'శ్రీమద్రామాయణ కల్పవృక్షాని'కి 1971లో జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఈయనకు తెలుగుభాష అన్నా, తెలుగుతనం అన్నా వల్లమాలిన అభిమానం. విశ్వనాథ సత్యనారాయణ గారు కేవలం ఒక కవి మాత్రమే కాదు, తెలుగు భాషకు ఒక నిధి. ఆయన రచనలు అనేక తరాల వారిని ప్రభావితం చేస్తూనే ఉంటాయి.