మీ పిల్లలకు చదువు మీద ఆసక్తి కలిగించడానికి చేయాల్సిన పనులు
పిల్లల్ని పెంచడం ఒక కళ. దానికి చాలా నేర్పు కావాలి, ఓర్పు కావాలి. పిల్లల పెంపకంలో మిగతా విషయాలను వదిలేస్తే, వాళ్ళకు చదువు మీద ఆసక్తి కలిగించడానికి చాలా ప్రయాస పడాల్సి వస్తుంది. ఆ ప్రయాసలు లేకుండా ఎలా చేస్తే మీ పిల్లలకు చదువు మీద ఆసక్తి కలిగించవచ్చో ఇక్కడ తెలుసుకుందాం. వినోదంతో వినూత్నంగా నేర్పండి: చేతికి పుస్తకం ఇచ్చి, ముందు మీరు కూర్చుని, వాళ్ళు తలెత్తిన ప్రతీసారీ కోపంగా చూస్తే, ఏ పిల్లాడికీ చదవాలన్న ఆసక్తి కలగదు. పాఠాన్ని ఆటతో మేళవించి నేర్పించాలి. ప్రోత్సహించండి: పిల్లలు బాగా చదువుకున్నప్పుడు భుజం మీద తట్టి చిన్న ప్రశంస, లేదంటే చిన్న చాక్లెట్ ఇవ్వండి. అంతకంతే పెద్ద గిఫ్ట్స్ ఇవ్వొద్దని గుర్తుంచుకోండి.
పిల్లలకు చదువు మీద ఆసక్తి కలగాలంటే చేయాల్సిన మరిన్ని పనులు
సందేహాలకు సమాధానం ఇవ్వండి: పిల్లలకు చాలా సందేహాలుంటాయి. వాటికి మీరు ఓపికగా సమాధానం చెప్పాలి. లేదంటే ఇంకోసారి అడిగే ప్రయత్నం వారు చేయకపోవచ్చు. అది మీ పిల్లల భవిష్యత్తుకు భంగం కలిగిస్తుంది. మీ పిల్లలు స్కూల్ నుండి రాగానే వాళ్ల పుస్తకాల్లోంచి ఆరోజు నేర్చుకున్న పాఠంలోంచి ప్రశ్నలు వేయండి. దానివల్ల వాళ్ళు స్కూల్లో ఎంత బాగా వింటున్నారో అర్థం అవుతుంది. మంచి వాతావరణం సృష్టించండి: పిల్లలు చదువుకునే వాతావరణం కళాత్మకంగా ఉండాలి. కిచెన్ లో అమ్మ వండుతుంటే అక్కడ చదవమని చెప్పకూడదు. అలాగే మీకు ఇద్దరు పిల్లలైతే ఒకరు చదువుతుంటే మరొకరు అదే రూమ్ లో బ్యాట్ బాల్ పట్టుకుని ఆడతూ ఉండకూడదు. దానివల్ల చదువు మీద ఆసక్తి నిలవదు.