Wedding Season: మొదలైన పెళ్లి సందడి..18 నుంచి జులై 9 వరకే శుభ ముహూర్తాలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి పెళ్లిళ్ల సందడి మొదలైంది. గత నెలన్నర రోజులుగా మూఢం, అధిక జ్యేష్ఠ మాసం కారణంగా శుభ ముహూర్తాలు లేక వివాహాలు నిలిచిపోయాయి. ఈ నెల 15 నుంచి నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభం కావడంతో పెళ్లిళ్లకు అనుకూల సమయం మొదలైంది. అయితే జూన్ 18 నుంచి జులై 9 వరకు మాత్రమే పరిమిత సంఖ్యలో ముహూర్తాలు అందుబాటులో ఉన్నాయి. అనంతరం జులై 15 నుంచి ఆషాఢ మాసం, గురుమూఢం ప్రారంభం కానుండటంతో ఆగస్టు 15 వరకు వివాహాలకు ముహూర్తాలు ఉండవు. ఆ తర్వాత శ్రావణ మాసంలోనే తిరిగి శుభకార్యాలకు అవకాశం ఉండటంతో ప్రస్తుతం పెళ్లిళ్లు నిశ్చయమైన కుటుంబాల్లో ఏర్పాట్ల హడావుడి మొదలైంది.
వివరాలు
యుద్ధ ప్రభావంతో మరింత పెరిగిన వివాహ వ్యయం
అయితే పరిమిత ముహూర్తాల కారణంగా వివాహాలకు సంబంధించిన అన్ని సేవలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. పురోహితులు, ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్, అలంకరణ, అద్దె వాహనాలు వంటి వాటికి భారీగా బుకింగ్‌లు వస్తుండటంతో ధరలు కూడా పెరుగుతున్నాయి. దీంతో పెళ్లి చేసుకునే కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా-ఇరాన్ యుద్ధ పరిస్థితుల ప్రభావం దేశీయ మార్కెట్‌పైనా కనిపిస్తోంది. పెట్రోలు, డీజిల్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వివాహ ఖర్చులపై కూడా ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడంతో క్యాటరింగ్ నిర్వాహకులు తమ ఛార్జీలను పెంచారు. అలాగే ఇంధన ధరల ప్రభావంతో రవాణా ఖర్చులు కూడా అధికమయ్యాయి.
వివరాలు
అమ్మో.. బంగారం ధరలు!
సాధారణంగా వేసవి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఫంక్షన్ హాళ్లకు అధిక డిమాండ్ ఉంటుంది. అయితే ఈసారి అధిక జ్యేష్ఠ మాసం కారణంగా కొంతకాలం వాటికి గిరాకీ తగ్గింది. ఇప్పుడు వరుసగా ముహూర్తాలు రావడంతో నిర్వాహకులు అద్దెలను పెంచుతున్నారని వధూవరుల తండ్రులు శివరామకృష్ణయ్య, నాగేశ్వరరావు తెలిపారు. పెళ్లి ఖర్చుల్లో బంగారం ప్రధాన భారం అవుతోంది. ఏడాది క్రితంతో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కుటుంబాలు కూడా కుమార్తె పెళ్లి సమయంలో మంగళసూత్రాలు, బంగారు గొలుసు, కమ్మలు, ముక్కుపుడక, గాజులు వంటి నగల కోసం కనీసం ఐదు నుంచి ఆరు తులాల బంగారం కొనుగోలు చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
వివరాలు
భోజనాల ఖర్చు కూడా భారీగానే..
ప్రస్తుతం అంత మొత్తంలో బంగారం కొనుగోలు చేయాలంటే రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీనికి తోడు కల్యాణ మండపం, అలంకరణలు, భోజనాలు, రాకపోకల ఏర్పాట్ల కోసం మరో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. వివాహాల్లో వడ్డించే వంటకాల సంఖ్య పెరగడం కూడా ఖర్చును అమాంతం పెంచుతోంది. ప్రస్తుతం వంటకాల రకాలను బట్టి ఒక్కో ప్లేటుకు కనీసం రూ.500 కంటే తక్కువ ఖర్చు కావడం లేదని ఫంక్షన్ హాలు యజమాని హరి తెలిపారు. పైగా పాతిక రకాల వంటకాలు లేకుండా అతిథులకు భోజనం పెట్టడం ప్రతిష్ఠకు సంబంధించిన అంశంగా భావిస్తుండటంతో కుటుంబాలు అదనపు భారం మోయాల్సి వస్తోందన్నారు.
వివరాలు
పెరుగుతున్న ఖర్చులు కుటుంబాలకు పెద్ద సవాలు
అమెరికా-ఇరాన్ యుద్ధానికి ముందు ఉన్న పరిస్థితులతో పోలిస్తే ఒక్క పెళ్లికి కనీసం రూ.5 లక్షల వరకు అదనపు ఖర్చు పెరిగిందని ఆయన వెల్లడించారు. పరిమిత ముహూర్తాల కారణంగా పురోహితుల నుంచి క్యాటరింగ్, డెకరేషన్, అద్దె వాహనాల నిర్వాహకుల వరకు అందరూ అధిక మొత్తాలు డిమాండ్ చేయడం కూడా వివాహ వ్యయాన్ని మరింత పెంచుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం పరిమిత ముహూర్తాలు, పెరిగిన బంగారం ధరలు, యుద్ధ ప్రభావంతో పెరిగిన నిత్యావసరాల ధరలు, వివాహ సేవల ఛార్జీల పెరుగుదల కలిసి తెలుగు కుటుంబాలపై భారీ ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. పెళ్లి శుభకార్యం ఆనందాన్ని పంచుతున్నప్పటికీ, పెరుగుతున్న ఖర్చులు మాత్రం కుటుంబాలకు పెద్ద సవాలుగా మారుతున్నాయి.