ఆరోగ్యం: కావాల్సిన దానికన్నా ఎక్కువగా నీళ్ళు తాగితే ఎలాంటి నష్టాలు వస్తాయో తెలుసుకోండి
పంచభూతాల్లో ఒకటైన నీరు, మన పంచప్రాణాలను కాపాడే ముఖ్యమైన మూలకం. శరీరంలో నీరు తగ్గితే మనిషి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. అలాగే నీరు ఎక్కువగా తాగితే కూడా ప్రమాదకరమే. ప్రస్తుతం, అతిగా నీరు తాగడం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయో తెలుసుకుందాం. సోడియం తగ్గుతుంది: నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని సోడియం తగ్గిపోతుంది. లీటర్ కు 135మిల్లీ మోల్స్ కంటే దిగువకు సోడియం చేరితే ప్రాణాపాయం కలుగుతుంది. సొడియం తగ్గడం వల్ల కణాలు ఉబ్బుతాయి. ఇది మెదడులో జరిగితే తీవ్ర నష్టం కలుగుతుంది.
నీళ్ళు ఎక్కువగా తాగితే కనిపించే లక్షణాలు
లీటర్ కు 135మిల్లీ మోల్స్ కంటే తక్కువ సోడియం గల పరిస్థితిని హైపోనాట్రెమియా అంటారు. దీని లక్షణాలు మెదడులో కణాలు ఉబ్బుతాయి. తలనొప్పి, వికారం, వాంతులు ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, బీపీ పెరగడం, కన్ఫ్యూజన్, అనవసర ఆందోళన, కండరాల బలహీనత కూడా ఉంటుంది. ఇంకా నాడీ వ్యవస్థ మీద పెను ప్రభావం పడుతుంది. పరిస్థితి మరీ తీవ్రంగా మారితే బ్రెయిన్ డ్యామేజ్, కోమా, మరణం సంభవిస్తుంది. ఒకరోజు మొత్తంలో 20-28లీటర్ల నీటిని బయటకు పంపే సామర్థ్యం కిడ్నీలకు ఉందని 2013లో జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. కానీ ఒకగంటలో 0.8-1.0కంటే ఎక్కువ నీటిని బయటకు పంపలేవు. అంటే తక్కువ సమయంలో ఎక్కువ నీటిని తాగడం మంచిది కాదు.
జాగ్రత్తగా ఉండాల్సింది ఎవరంటే?
సాధారణంగా క్రీడాకారులు, అథ్లెట్స్, వ్యాయామం ఎక్కువగా చేసేవారు నీటిని ఎక్కువగా తాగుతారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకరోజులో ఎన్ని లీటర్ల నీటిని తాగాలి? వయసును బట్టి ఎవరు ఎన్ని లీటర్ల నీటిని తాగాలనేది వైద్యులు సూచిస్తారు. యుక్తవయసులో ఉన్నవారు ఒకరోజులో 2-4లీటర్ల నీటిని తాగాలని నిపుణులు చెబుతారు. కానీ నీటిని తాగే విషయంలో మీ బాడీ మాటను వినండి. అలాగే తక్కువ సమయంలో ఎక్కువ నీటిని తాగకండి.