
Overthinking Symptoms: మీరేమైనా ఓవర్ థింకింగ్ అధిక ఆలోచనల వలయంలో చిక్కుకున్నారా? పరిష్కారాలు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
ఏ విషయం గురించైనా మనసులో ఆలోచనలు రావడం సహజం. కొన్నిసార్లు ఒత్తిడి, ఆందోళన కలగడం కూడా సాధారణమే. కానీ కొంతమంది మాత్రం జరిగిన సంఘటనలపై మాత్రమే కాకుండా, జరగకపోయే విషయాలపై కూడా ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ బుర్రను పాడుచేసుకుంటారు. ఏదో జరిగిపోతుందేమో అన్న అనుమానాలతో ఆలోచనల వలలో చిక్కుకుపోతారు. ఈ వలయం నుంచి బయటపడటం అంత తేలిక కాదు. మరి అతిగా ఆలోచించే వారికి సాధారణంగా కనిపించే లక్షణాలేమిటి? ఆలోచనల తుఫాన్‌ను నియంత్రించాలంటే ఏమి చేయాలి? అనే ప్రశ్నలకు నిపుణులు చెప్పిన వివరణ ఇదే.
వివరాలు
అధిక ఆలోచనలకు కారణాలేమిటి?
లక్ష్యాన్ని సాధించే క్రమంలో వరుస ఓటములు ఎదురైనవారు ఎక్కువగా అధిక ఆలోచనలకు లోనవుతారు. కొందరు అనవసర అంచనాల భారంతో "ఇది నాకయ్యే పని కాదేమో" అని అనుమానపడుతుంటారు. అంచనాలు నెరవేరవన్న భయం ఎప్పుడూ వెంటాడుతుంది. తామేంటో నిరూపించుకోవాలన్న తపన, సురక్షితంగా ఉండాలన్న భావనతో ప్రతి విషయం మీదా పదే పదే ఆలోచిస్తారు. ఫలితంగా అసురక్షిత భావన మరింత పెరుగుతుంది. దగ్గరి వారిని కోల్పోయామనే బాధ, జీవితంలో ఓటమి భావన, సమాజంలో ఎదురయ్యే విమర్శలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగం లేదా కెరీర్‌లో వెనకబడిపోవడం—ఇవి అన్నీ అధిక ఆలోచనకు ప్రధాన కారణాలు అవుతాయి.
వివరాలు
అధిక ఆలోచన చేసేవారి లక్షణాలు
ఒకే అంశంపై పదేపదే ఆలోచించడం. ఆలోచనల కారణంగా పదే పదే వాగ్వివాదాలు జరగడం. ఒకే విషయంపై వరుస కాల్స్ చేసి ఎదుటివారిని విసిగించడం. పనిపట్ల ఆసక్తి తగ్గిపోవడం; పనిలో ఏకాగ్రత కుదరకపోవడం. ఇతరులు తమ గురించి ఏమనుకుంటారో అనే ఆలోచనలో సమయం వృథా చేయడం. భావోద్వేగాల బంధనంలో చిక్కుకుని ఎప్పుడూ ఒత్తిడితో, ఆందోళనతో ఉండటం. మానసిక అలసట పెరగడం,ఒత్తిడి ఎక్కువైపోవడం. కొత్త ఆలోచనలు లేదా నిర్ణయాలు తీసుకునే శక్తి తగ్గిపోవడం. ఎప్పుడు నెగెటివ్ మోడ్‌లో ఉండటం. త్వరగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల వ్యక్తిగత అభివృద్ధి ఆగిపోవడం. నిద్ర, ఆహారం, ఏకాగ్రత, వ్యక్తిగత జీవితం.. అన్నిటిపై ప్రతికూల ప్రభావం చూపడం. మనశ్శాంతి కోల్పోవడం, తనపై నమ్మకం తగ్గిపోవడం. స్వంత నిర్ణయాలపై సందేహాలు పెరిగి గందరగోళ స్థితికి చేరుకోవడం. ఎవరో చెప్పిన మాట,పంపిన మెసేజ్ గురించి కూడా అతి ఆలోచన చేయడం.
వివరాలు
నివారణా మార్గాలు
మనసులోకి వచ్చే ఆలోచనలను కాగితంపై రాయడం అలవాటు చేసుకోండి. ముందుగా మీరు ఎక్కువగా ఆలోచించే కారణాలను గుర్తించాలి. ఆందోళన కలిగించే విషయానికి రోజులో 15-20 నిమిషాల సమయం కేటాయించండి. ఆ సమయం పూర్తయ్యాక ఆ ఆలోచనను అక్కడే వదిలేసి, దృష్టిని వేరే దానిపై నిలిపేయండి అని నిపుణులు సూచిస్తున్నారు. నడవడం, సంగీతం వినడం,చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం వంటి చర్యలు ఒత్తిడిని తగ్గిస్తాయి. ఒకే విషయం మీద పదే పదే ఆలోచించడం అంటే వృత్తంలో తిరుగుతున్నట్టే. ఎంత ఆలోచించినా మళ్లీ మొదటికి వచ్చేస్తారు. కాబట్టి ఆ వృత్తం నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో 90:10 పద్ధతిని పాటించాలి. అంటే 90 శాతం స్వీయ విశ్లేషణకు,10 శాతం మాత్రమే ఇతరుల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
వివరాలు
నివారణా మార్గాలు
అధిక ఆలోచన చేసేవారు సాధారణంగా ఇతరుల మాటలకే ప్రాధాన్యం ఇస్తారు. తమ స్వంత ఆలోచనలను పక్కన పెట్టేస్తారు. ఇది చివరికి సమస్యలను పెంచుతుంది. సానుకూల దృక్పథం లేని వారు అధిక ఆలోచనల బారిన పడతారు. "ఏదో తప్పు జరుగుతుందేమో" అనే భయం వెంటాడుతుంది. కానీ "అన్నీ మంచిగానే జరుగుతాయి" అన్న సానుకూల దృక్పథాన్ని అలవర్చుకుంటే ఆలోచనల తీవ్రత తగ్గుతుంది. గతం, భవిష్యత్తుపై ఎక్కువగా ఆలోచించకుండా వర్తమానంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగాలి. ఇతరులతో కలిసిమెలిసి ఉండడం, స్నేహితులతో సమయం గడపడం ఒంటరితనాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.