LOADING...
Karthika Deepam: కార్తీక మాసంలో దీపారాధన ఎప్పుడు చేయాలి? తప్పక పాటించాల్సిన నియమాలు ఇవే!
కార్తీక మాసంలో దీపారాధన ఎప్పుడు చేయాలి? తప్పక పాటించాల్సిన నియమాలు ఇవే!

Karthika Deepam: కార్తీక మాసంలో దీపారాధన ఎప్పుడు చేయాలి? తప్పక పాటించాల్సిన నియమాలు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 10, 2025
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

కార్తీక మాసంలో దీపారాధనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. దీపాన్ని ఎప్పుడు, ఎలా వెలిగించాలి, దానివల్ల కలిగే ఫలితాలు ఏమిటి అన్న విషయాలను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పంచారామక్షేత్రం శ్రీ ఉమాసోమేశ్వర జనార్దనస్వామి ఆలయ అభిషేక్‌ పండిత్‌ కొత్తపల్లి వెంకట సత్య సుబ్రహ్మణ్యం వివరించారు. కృత్తికా నక్షత్రం కలిగిన పౌర్ణమితో ప్రారంభమయ్యే నెలను 'కార్తీక మాసం' అంటారు. కృత్తికా నక్షత్రం కుమారస్వామి జన్మ నక్షత్రం కావడంతో, ఈ మాసం ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. "అజ్ఞానాన్ని పోగొట్టేది దీపం" అనే సూత్రాన్ని ప్రతిబింబించే ఈ దీపారాధనే 'కార్తీకదీపం'గా ప్రసిద్ధి చెందింది. కృత్తికా నక్షత్రం అగ్నికి సంబంధించినదై ఉండటంతో దీపం అగ్నిస్వరూపమైన పరమాత్మ జ్యోతిని సూచిస్తుంది.

Details

దీపారాధన మహిమ 

'దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపేన సాధ్యతే సర్వం' ఈ వాక్యం ప్రకారం దీపజ్యోతి పరమాత్మ స్వరూపం. దీపారాధన మనలోని అజ్ఞానాన్ని తొలగించి ఆత్మను చైతన్యం చేస్తుంది. దీపం వెలిగించే సమయంలో మనస్సు, శరీరం నిశ్చలంగా, పవిత్రంగా ఉండాలి. దీపం వెలిగించే సమయం, విధానం తెల్లవారకముందే స్నానం చేసి, ఉదయం 5 గంటల నుండి 6:30 నిమిషాల మధ్యలో దీపం వెలిగించాలి. ఆవు నెయ్యితో వెలిగించే దీపం సర్వశ్రేయస్సును ప్రసాదిస్తుంది. నువ్వుల నూనెతో వెలిగిస్తే శని దోషం తొలగి, శత్రువులు నశిస్తారు. అలాగే ఆముదం నూనెతో వెలిగించిన దీపం కూడా శత్రువుల వినాశనం కలిగిస్తుంది. ఇతర నూనెలతో దీపం వెలిగిస్తే ఆ ఫలితాలు లభించవు.

Details

 కార్తీక మాస దీపారాధన విశిష్టత 

హిందూ సంప్రదాయంలో ప్రతి వ్యక్తి ప్రతిరోజూ ఉదయాన్నే దీపారాధన చేయడం శ్రేయస్కరం. కానీ అది సాధ్యంకాకపోవడం వల్ల కార్తీక మాసంలో 365 వత్తులతో ఒక దీపం వెలిగించే ఆచారం ఉంది. ఈ దీపాన్ని సాయంత్రం సమయంలో వెలిగించాలి. సంవత్సరంలో 365 రోజులకు సంకేతంగా ఈ దీపం వెలిగించడం ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రమైన కర్మ. కార్తీక పాడ్యమి నుంచి బహుళ అమావాస్య వరకు ఏ రోజైనా దీపం వెలిగిస్తే అది కార్తీకదీపంగానే పరిగణించబడుతుంది. కార్తీకదీపం వెలిగించడం వల్ల ఆ కాంతి ప్రసరించే ప్రదేశమంతా ప్రకృతి, పశుపక్ష్యాదులు,పంటలు,పాడిపశువులు, సంపదతో విరాజిల్లుతుందని పండితులు చెబుతున్నారు. అందుకే కార్తీక మాసంలో దీపారాధన చేయడం కేవలం ఆచారం మాత్రమే కాక, ఆధ్యాత్మిక చైతన్యానికి దారి చూపే పవిత్ర సాధనగా భావించబడుతోంది.