LOADING...
City of Lakes: లేక్స్ సిటీ ఏదో తెలుసా? ఇదే ఆ నగరం… ట్రావెలర్లకు ఫేవరెట్ డెస్టినేషన్!
లేక్స్ సిటీ ఏదో తెలుసా? ఇదే ఆ నగరం… ట్రావెలర్లకు ఫేవరెట్ డెస్టినేషన్!

City of Lakes: లేక్స్ సిటీ ఏదో తెలుసా? ఇదే ఆ నగరం… ట్రావెలర్లకు ఫేవరెట్ డెస్టినేషన్!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 19, 2026
11:33 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం అనేక సంస్కృతులు, భూభాగాలు, చారిత్రక నగరాలతో విభిన్నతకు నిలయంగా నిలుస్తుంది. అలాంటి నగరాల్లో రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ఉదయపూర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నగరం 'సరస్సుల నగరం'గా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. అరావళి కొండల మధ్యలో విస్తరించి ఉన్న ఉదయపూర్‌... అందమైన సరస్సులు, రాజవంశపు మహల్‌లు, చారిత్రక కట్టడాలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ప్రశాంతమైన వాతావరణం, సంపన్నమైన వారసత్వం, రొమాంటిక్ ఫీల్‌ ఈ నగరాన్ని భారత్‌లోని అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా నిలబెడుతున్నాయి.

వివరాలు 

నగర సౌందర్యం

ఉదయపూర్‌ సహజ అందం, శిల్పకళా వైభవానికి ప్రసిద్ధి. రాజుల చరిత్రకు, ప్రకృతి అందానికి అద్భుతమైన మేళవింపు ఇక్కడ కనిపిస్తుంది. నీలి సరస్సుల నీటిలో తెల్లని మార్బుల్‌ మహల్‌లు ప్రతిబింబించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ముఖ్యంగా సూర్యోదయం, సూర్యాస్తమయ వేళల్లో ఈ దృశ్యం మరింత మంత్రముగ్ధం చేస్తుంది. ఇరుకైన వీధులు, సంప్రదాయ మార్కెట్లు, రంగురంగుల పండుగలు, అతిథి సత్కారానికి పేరొందిన ప్రజలు ఈ నగరానికి మరింత అందాన్ని జోడిస్తున్నాయి. ప్రశాంతత కోరుకునే వారికి, సంస్కృతి అనుభూతిని ఆస్వాదించాలనుకునే వారికి ఉదయపూర్‌ అద్భుతమైన గమ్యం.

వివరాలు 

సరస్సులు - పర్యాటకానికి ప్రాణం

ఉదయపూర్‌ అంటే సరస్సులే గుర్తుకొస్తాయి. నగర పర్యాటకానికి ఈ సరస్సులే ప్రధాన ఆకర్షణ. పిచోలా సరస్సు, ఫతే సాగర్ సరస్సు, ఉదయ్‌ సాగర్, స్వరూప్‌ సాగర్ వంటి సరస్సులు నగర సౌందర్యాన్ని రెట్టింపు చేస్తున్నాయి. పడవ ప్రయాణాలు, సరస్సు ఒడ్డున కేఫేలు, అందమైన వ్యూ పాయింట్లు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. పడవలో ప్రయాణించడం, ఫోటోగ్రఫీ, సాయంత్రం సరస్సు ఒడ్డున నడక... ఇవన్నీ ఉదయపూర్‌ టూరిజంలో విడదీయరాని భాగంగా మారాయి.

Advertisement

వివరాలు 

ఉదయపూర్‌లో తప్పక చూడాల్సిన ప్రదేశాలు

ఉదయపూర్‌ పర్యటనలో సిటీ ప్యాలెస్‌ ముఖ్య ఆకర్షణ. ఇది రాజవంశపు శిల్పకళను, మ్యూజియంలను ప్రదర్శిస్తుంది. పిచోలా సరస్సు పడవ ప్రయాణాలకు ప్రసిద్ధి. అదే సరస్సులో ఉన్న జగ్‌మందిర్‌ దీవి మహల్‌ ప్రత్యేక ఆకర్షణ. ఫతే సాగర్ సరస్సు పడవ ప్రయాణాలు, సూర్యాస్తమయ దృశ్యాలకు పేరుగాంచింది. సహేలియోన్‌ కీ బారీ అనే చారిత్రక తోట, జగదీశ్‌ ఆలయం వంటి ప్రదేశాలు కూడా పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

Advertisement

వివరాలు 

సందర్శించడానికి అనుకూల సమయం

ఉదయపూర్‌ను సందర్శించడానికి అక్టోబర్‌ నుంచి మార్చి వరకు ఉత్తమ కాలంగా భావిస్తారు. ఈ సమయంలో వాతావరణం చల్లగా ఉండి దర్శనాలకు అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఎండలు ఎక్కువగా ఉన్నా, హోటల్‌ ధరలు తక్కువగా ఉండటం వల్ల బడ్జెట్‌ ప్రయాణికులకు ఈ కాలం సరిపోతుంది. జూలై నుంచి సెప్టెంబర్‌ వరకు వర్షాకాలంలో సరస్సులు నిండుగా కనిపించి నగరానికి మరింత అందాన్ని తీసుకువస్తాయి. ఈ కాలంలో పర్యాటకులు తక్కువగా ఉండటంతో రొమాంటిక్‌ వాతావరణం నెలకొంటుంది.

వివరాలు 

ఉదయపూర్‌ పర్యటనకు అంచనా ఖర్చు

ఉదయపూర్‌ టూర్‌కు వ్యక్తికి సుమారు అంచనా ఖర్చు ఇలా ఉంటుంది. ప్రయాణ ఖర్చులు రూ.2,000 నుంచి రూ.5,000 వరకు ఉండొచ్చు. వసతి ఖర్చులు రాత్రికి రూ.1,500 నుంచి రూ.4,000 వరకు ఉంటాయి. భోజనానికి రోజుకు సుమారు రూ.800 నుంచి రూ.1,500 ఖర్చవుతుంది. లోకల్‌ ట్రాన్స్‌పోర్ట్‌కు రూ.500 నుంచి రూ.1,000 వరకు అవసరం. దర్శనాల కోసం మరో రూ.500 నుంచి రూ.1,000 వరకు ఖర్చవుతుంది. గమనిక: ప్రయాణ విధానం, కాలాన్ని బట్టి ఈ ఖర్చులు మారవచ్చు.

Advertisement