Mauni amavasya: మౌని అమావాస్య ఎందుకు అంటారు? ఈ రోజున సముద్రస్నానం చేస్తే ఏం ఫలితం?
ఈ వార్తాకథనం ఏంటి
పుష్య బహుళ అమావాస్యను సాధారణంగా మౌని అమావాస్యగా పిలుస్తారు. ఉత్తరాయణం ప్రారంభమైన తరువాత వచ్చే తొలి అమావాస్య ఇదే కావడం దీని ప్రత్యేకత. ఈ పేరుకు గల కారణం కూడా విశిష్టమైనదే. పుణ్యప్రదమైన ఉత్తరాయణ కాలానంతరం వచ్చే ఈ రోజున ఉపాసకులు, యతులు, సాధువులు, సాధకులు మౌనంగా తమ తమ సాధనలను కొనసాగిస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతంలో మౌనవ్రతాన్ని పాటించే సంప్రదాయం ఉంది. మౌనవ్రతానికి ప్రతీకగా ఈ అమావాస్యకు 'మౌని అమావాస్య' అనే పేరు స్థిరపడింది. తపస్సులో సిద్ధిని పొందిన వారిని 'మౌని'గా వ్యవహరిస్తారు. తపస్సు అంటే సంకల్పించిన విషయంపై తప్ప ఇతర ఆలోచనలేవీ లేకుండా ఉండడం అని అర్థం.
Details
చొల్లంగితో ముగిసే సప్తసాగర యాత్ర
ఈ రోజున సముద్ర స్నానం చేయడం శుభకరమని భావిస్తారు. త్రివేణి సంగమంలో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదమని శాస్త్రాలు చెబుతాయి. గోదావరి నదిలో స్నానం చేయడం కూడా పరమ శుభదాయకంగా భావిస్తారు. గౌతమ మహర్షి తపస్సు ఫలితంగా గోదావరి నది ఆవిర్భవించిందని పురాణాలు చెబుతాయి. ఆ గోదావరి జలాలను ఏడుగురు రుషులు ఏడుపాయలుగా విభజించి, ఏడు వేర్వేరు ప్రాంతాల్లో సముద్రంలో కలిపినట్లు కథనాలు ఉన్నాయి. గౌతముడు తీసుకెళ్లిన శాఖకు 'గౌతమి' అనే పేరు స్థిరపడింది. తుల్యుడు, ఆత్రేయుడు, భరద్వాజుడు, కౌశికుడు, జమదగ్ని, వశిష్ఠుడు అనే ఆరుగురు రుషులు తీసుకెళ్లిన శాఖలు వారి వారి పేర్లతో ప్రసిద్ధి చెందాయి.
Details
ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు అత్యంత పవిత్రంగా భావిస్తారు
తుల్యుడు తీసుకెళ్లిన శాఖ 'తుల్యభాగ'గా పిలవబడి చొల్లంగి గ్రామం వద్ద సముద్రంలో కలుస్తుంది. ఈ ఏడు సాగర సంగమాలను ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ ఏడు ప్రదేశాలకు వెళ్లి స్నానం చేయడాన్ని 'సప్తసాగర యాత్ర'గా పిలుస్తారు. ఈ యాత్ర చేయడం వల్ల ఏడు సముద్రాల్లో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. ప్రతి స్థలంలో స్నానం చేయడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయని, తెలిసీ తెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని విశ్వాసం. ఈ సప్తసాగర యాత్ర పుష్య బహుళ అమావాస్య నాడు చొల్లంగి వద్ద గోదావరి సంగమ స్నానంతో పూర్తవుతుంది. అందువల్ల ఈ అమావాస్యను 'చొల్లంగి అమావాస్య' అని కూడా అంటారు.
Details
సూర్యానుగ్రహం
ఈ సంవత్సరం జనవరి 18న అమావాస్య ఆదివారం నాడు రావడం మరింత విశేషంగా భావిస్తున్నారు. సాధారణంగా అమావాస్య రోజున సూర్యుడు అత్యంత బలంగా ఉంటాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఈ సమయంలో సూర్య గమనం భూమికి సమీపంగా సాగుతుంది. భాస్కరుడికి అంకితమైన ఆదివారం నాడు అమావాస్య రావడం సాధకులకు మరింత శక్తిని ప్రసాదిస్తుందని నమ్మకం. జాతకంలో గ్రహదోషాలు ఉన్నవారు ఈ మౌని అమావాస్య నాడు సముద్రం, త్రివేణి సంగమం లేదా గోదావరి వంటి ఏదైనా జీవనదీలో స్నానం చేసి, సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఎర్రని పువ్వులు, ఎర్రచందనంతో అర్చన చేయడం ద్వారా సూర్యుని అనుగ్రహం లభిస్తుంది.
Details
పరిపూర్ణ ఆరోగ్యం లభించాలి
దీని ఫలితంగా కుజ, రాహు, కేతు గ్రహదోషాలు తొలగి, ఆరోగ్యప్రదాత అయిన సూర్యుని కృప లభిస్తుందని విశ్వాసం. దీర్ఘకాలిక అనారోగ్యాలు తగ్గి, పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని చెబుతారు. ఈ రోజున బ్రహ్మీ ముహూర్తంలో లేదా సూర్యోదయానికి ముందు, లేక సూర్యోదయం తరువాత 90 నిమిషాల లోపే స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదం.
Details
పితృ కార్యాల ప్రాధాన్యం
అమావాస్య పితృపర్వంగా కూడా భావించబడుతుంది. పితృశాపాలు లేదా జాతకంలో పితృదోషాలు ఉన్నవారు ఈ రోజున అన్నదానం, లవణ దానం, పెరుగు దానం, గుమ్మడికాయ దానం చేయడం ద్వారా పితృదేవతల అనుగ్రహాన్ని పొందుతారని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. మౌని అమావాస్య నాడు యోగ్యుడైన బ్రాహ్మణునికి పితృప్రీతిగా బూడిద గుమ్మడికాయను దానం చేయడం వల్ల గుమ్మడికాయ బరువంత బంగారం దానం చేసిన ఫలితం లభిస్తుందని కొన్ని గ్రంథాల్లో ఉంది. సంక్రాంతి రోజున చేయవలసిన దానాలు లేదా విధులు ఏ కారణంతోనైనా చేయలేని వారు ఈ మౌని అమావాస్య నాడు చేయడం వల్ల విశేష ఫలితాలు పొందుతారని విశ్వాసం.
Details
ప్రత్యేక ఆరాధనలు
ఈ మౌని అమావాస్య నాడు సూర్యారాధనతో పాటు కాలభైరవుడు, వీరభద్రుడు, మహాకాళి వంటి ఉగ్రదేవతల ఆరాధన విశేష ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా రుణబాధలు, ఆర్థిక సమస్యలు ఉన్నవారు కాలభైరవ స్వామిని దర్శించి 21 లేదా 27 లేదా 36 మినపగారెల మాలను సమర్పించి, బూడిద గుమ్మడి దీపాన్ని వెలిగిస్తే సమస్యలు తొలగుతాయని నమ్మకం. మనోభీతి, మానసిక అశాంతి, పిల్లల్లో వాక్సంబంధ సమస్యలు (నత్తి, మూగతనం), మానసిక ఎదుగుదల లోపం వంటి ఇబ్బందులు ఉన్నవారు వీరభద్ర స్వామిని దర్శించి బిల్వదళాలతో అర్చన చేయాలి.
Details
108 నిమ్మకాయలతో చేసిన దండను సమర్పించాలి
భద్రకాళి అమ్మవారికి 21 లేదా 54 లేదా 108 నిమ్మకాయలతో చేసిన దండను సమర్పిస్తే భూతబాధలు, దుష్టగ్రహ ప్రభావాలు, నరఘోష వంటి దోషాలు తొలగుతాయని విశ్వాసం. అలాగే ఆదివారం అమావాస్య నాడు ప్రదోష సమయంలో ముళ్లతో ఉండే గారమండను (గార చెట్టు కొమ్మ) పసుపు, కుంకుమలతో పూజించి సాంబ్రాణి ధూపం వేసి ఇంటి ప్రధాన గుమ్మానికి కట్టివేస్తే సమస్త గ్రహదోషాలు నివృత్తి అవుతాయని శాస్త్రోక్త నమ్మకం.