రోజువారి ఆహారంలో ఉప్పు, చక్కెర, కొవ్వులను ఎక్కువగా ఎందుకు తీసుకోకూడదో తెలుసుకోండి
మనం రోజూ తీసుకునే ఆహారంలో ఉప్పు, చక్కెర, కొవ్వులు కచ్చితంగా ఉంటాయి. అయితే వీటిని ఎంత మోతాదులో తీసుకుంటున్నామనే విషయంపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. వీటిని మితంగా తీసుకుంటే ఎలాంటి నష్టం లేదు. వీటి వాడకం ఎక్కువైతే శరీరానికి నష్టం కలుగుతుంది. ప్రస్తుతం ఉప్పు, చక్కెర, కొవ్వులను ఎంత మేర తినాలి? ఎక్కువ తీసుకుంటే వచ్చే నష్టాలు ఏంటనేది తెలుసుకుందాం. ఉప్పు ఎక్కువగా తిన్నట్లయితే బీపీ పెరిగే అవకాశం ఎక్కువ. అంతేకాదు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఒకవేళ మీరు చక్కెర ఎక్కువగా తీసుకున్నట్లయితే డయాబెటిస్, ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొవ్వులను ఎక్కువగా తీసుకుంటే బరువు పెరగడమే కాక హృదయ సంబంధ వ్యాధులు వస్తాయి.
ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలను తక్కువగా తీసుకోవాలంటే చేయాల్సిన పనులు
మీరు ఆహారానికి సంబంధించిన ఏది కొన్నా దానిలో ఏయే పదార్థాలు ఎక్కువగా ఉన్నాయో తెలుసుకోండి. చక్కెర, కొవ్వు, ఉప్పు ఎక్కువగా ఉన్నట్లయితే అలాంటి వస్తువులను కొనడం మానేయండి. తినేటప్పుడు భోజనం మీదే దృష్టి ఉంచాలి: స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత తినేటప్పుడు కూడా వాటినే చూడడం అలవాటైపోయింది. దానివల్ల ఎంత తింటున్నామో తెలియకుండా పోతుంది. ఇలా మీ శరీరంలోకి ఎక్కువ ఉప్పు, చక్కెర, కొవ్వులు చేరిపోతాయి. కాబట్టి తినేటప్పుడు మీ దృష్టి భోజనం మీదే ఉండాలి. బ్యాలెన్స్ గా తినాలి: ఉప్పు, చక్కెర, కొవ్వుల్లో దేన్ని కూడా అధికంగా తీసుకోకూడదు. ప్రతీ దాన్ని మితంగా తీసుకోవాలి. అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్టు దేన్నీ ఎక్కువగా తీసుకోకూడదు.