Horsley hills: మంచు అందాలతో పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్న హార్సిలీహిల్స్
ఈ వార్తాకథనం ఏంటి
మంచు దుప్పటి కప్పుకున్న కొండలు... ఘాట్ రోడ్ల మలుపుల్లో ఆకాశాన్ని తాకుతున్నట్లుగా కనిపించే నీలగిరి చెట్లు... ఎటు చూసినా మనసును మంత్రముగ్ధం చేసే పచ్చదనం... ప్రశాంతతను నింపే బోటింగ్... ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే పర్యాటకులను ఆకట్టుకునే విశేషాలతో మన రాష్ట్రంలోని ఊటీగా పేరుగాంచిన హార్సిలీహిల్స్ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. చలికాలం కావడంతో మంచు ముసుగులో మెరిసిపోతున్న ఈ కొండ ప్రాంతం ప్రకృతి ప్రేమికులను రమ్మంటూ ఆహ్వానిస్తోంది. ప్రతి సంవత్సరం ఈ కాలంలో కొండపై పర్యాటక సందడి మొదలవుతుండగా, ఫిబ్రవరి వరకు ఈ సందడి కొనసాగే అవకాశం ఉంది.
వివరాలు
ఎన్నో ప్రత్యేకతలు
అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం కోటావూరు పంచాయతీలో ఉన్న హార్సిలీహిల్స్ సముద్ర మట్టానికి సుమారు 4,312 అడుగుల ఎత్తులో విస్తరించి ఉంది. ఇక్కడ ఏడాది పొడవునా చలి వాతావరణమే ఉంటుంది. తరచూ మంచు కురుస్తుండటంతో ఉదయం వేళల్లో వణుకు పుట్టించే చలి అనుభూతి కలుగుతుంది. ఘాట్ రోడ్లపై ఉదయం సమయాల్లో వాహనాలు లైట్లు వేసుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంటుంది. గత ఏడాది సమృద్ధిగా కురిసిన వర్షాల కారణంగా కొండ ప్రాంతం అంతా పచ్చదనంతో పరుచుకుంది. ఉదయం, సాయంత్రం మంచు, మధ్యాహ్నం ఎండ కలిసి పర్యాటకులకు అరుదైన అనుభూతిని అందిస్తున్నాయి. అటవీ మార్గాల ద్వారా కొండపైకి ట్రెక్కింగ్ చేయడానికి యువత పెద్ద సంఖ్యలో తరలివస్తోంది.
వివరాలు
ఉదయం-సాయంత్రం బస్సు సౌకర్యం
హార్సిలీహిల్స్ తిరుపతి, బెంగళూరు నుంచి సుమారు 150 కిలోమీటర్లు, చిత్తూరు నుంచి 128 కిలోమీటర్లు, చెన్నై నుంచి 250 కిలోమీటర్లు, మదనపల్లె నుంచి 28 కిలోమీటర్లు, బి.కొత్తకోట నుంచి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. మదనపల్లె, బి.కొత్తకోట, హార్సిలీహిల్స్ క్రాస్ నుంచి బస్సులు, అద్దె టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. అనంతపురం, కదిరి వైపు నుంచి వచ్చే పర్యాటకులు కాండ్లమడుగు క్రాస్ మీదుగా కొండపైకి చేరుకోవచ్చు. మదనపల్లె, రాయచోటి నుంచి వచ్చే వారు అంగళ్లు బైపాస్ మార్గాన్ని ఉపయోగించాలి. బెంగళూరు, హిందూపురం, చేలూరు వైపు నుంచి వచ్చే వారు బి.కొత్తకోట చేరుకుని అక్కడి నుంచి కొండపైకి వెళ్లవచ్చు. మదనపల్లె నుంచి హార్సిలీహిల్స్‌కు అంగళ్లు, కాండ్లమడుగు మీదుగా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులు నడుస్తున్నాయి.
వివరాలు
చూడాల్సిన ప్రాంతాలు
హార్సిలీహిల్స్‌లో పర్యాటకులను ఆకట్టుకునే ప్రదేశాలు అనేకం ఉన్నాయి. కొత్త, పాత వ్యూపాయింట్లు, గాలిబండ, గవర్నర్ బంగ్లా, ఏనుగు మల్లమ్మ ఆలయం, మానస సరోవరంలో బోటింగ్, మినీ జంతు ప్రదర్శనశాల, మొసళ్ల పార్కు, పర్యావరణ అధ్యయన కేంద్రం ముఖ్యమైనవి. అలాగే పర్యాటక శాఖ ప్రాంగణంలోని స్విమ్మింగ్ పూల్, ఫిష్ స్పా, అడ్వెంచర్ యాక్టివిటీలు, గంగోత్రి చెరువును సందర్శించకుండా వెళ్లరాదు.
వివరాలు
వసతి ఏర్పాట్లు
పర్యాటకుల కోసం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 60 గదులతో అతిథి గృహాలు అందుబాటులో ఉన్నాయి. గదుల స్థాయిని బట్టి రోజువారీ అద్దె రూ.1,313 నుంచి రూ.7,508 వరకు ఉంటుంది. అటవీ శాఖకు చెందిన 11 అతిథి గదులు కూడా ఉన్నాయి. వీటి అద్దె రోజుకు రూ.3,300గా నిర్ణయించారు. ఈ గదులను ఆన్‌లైన్ ద్వారా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. అదనంగా ప్రైవేటు అతిథి గృహాలు కూడా పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి.