వరల్డ్ ఆల్జీమర్స్ డే 2023: ఈ మతిమరుపు వ్యాధి గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు
ఆల్జీమర్స్ అనేది 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆల్జీమర్స్ కారణంగా మెదడు కుంచించుకు పోతుంది. మెదడులోని కణాలు ఒక్కొక్కటిగా చనిపోతూ ఉంటాయి. దీనివల్ల మతిమరుపు పెరుగుతుంది. ఈ మతిమరుపు ఎంతలా ఉంటుందంటే ఒక్కోసారి రోజువారి పనులు చేయడం కూడా మర్చిపోతుంటారు. ఆల్జీమర్స్ పై అవగాహన కలిగించడానికి, ఆల్జీమర్స్ వ్యాధి చికిత్స.. మొదలగు విషయాలను తెలియజేయడానికి ప్రతీ ఏడాది సెప్టెంబర్ 21వ తేదీన ప్రపంచ ఆల్జీమర్స్ డే ని జరుపుతారు. ఆల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న వారికి రక్షణ అందించడం ఆల్జీమర్స్ డే ప్రధాన లక్ష్యం. 1994 సెప్టెంబర్ 21వ తేదీన మొదటిసారిగా ప్రపంచ ఆల్జీమర్స్ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ దినోత్సవాన్ని ఆల్జీమర్స్ డిసీజ్ ఇంటర్నేషనల్, ప్రపంచ ఆరోగ్య సంస్థ కలిసి ప్రారంభించాయి.
ఆల్జీమర్స్ డే చరిత్ర, ఇతర విషయాలు
ఆల్జీమర్స్ డిసీజ్ ఇంటర్నేషనల్ ఏర్పడి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆల్జీమర్స్ డే ని జరుపుకున్నారు. అప్పటినుండి ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఆల్జీమర్స్ వ్యాధి బారిన పడిన వారు తమ రోజువారి పనులను మర్చిపోతుంటారు, మాటిమాటికి మూడ్ మారిపోతుంటుంది. ఈ వ్యాధి మరీ తీవ్రమైతే కుటుంబ సభ్యుల పేర్లు, కుటుంబ సభ్యులను కూడా మర్చిపోతారు. ప్రస్తుతానికి ఆల్జీమర్స్ వ్యాధికి చికిత్స లేదు కానీ మందుల వల్ల దీని లక్షణాలను తగ్గించవచ్చు. వృద్ధాప్యం, తలకు బలమైన గాయాలు తగలడం, తీవ్రమైన ఒత్తిడి, పొగాకు మొదలైన వాటి కారణంగా ఆల్జీమర్స్ వచ్చే అవకాశం ఉంది.