వరల్డ్ ఆర్థరైటిస్ డే 2023: ఆర్థరైటిస్ లక్షణాలు, రాకుండా నివారించే మార్గాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్థరైటిస్ అంటే కీళ్ల వ్యాధి అని చెప్పవచ్చు. ఎముకల జాయింట్ల ప్రాంతంలో నొప్పులు కలగడం ఆర్థరైటిస్ ప్రధాన లక్షణం.
ప్రతీ ఏడాది అక్టోబర్ 12వ తేదీన ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవాన్ని జరుపుతున్నారు.
ఆర్థరైటిస్ పై అందరికీ అవగాహన కలగజేయడానికి, అలాగే ఆర్థరైటిస్ వచ్చే ముందు కనిపించే లక్షణాలను తెలియజేసి ఆర్థరైటిస్ ఇబ్బందుల నుండి విముక్తి కలగజేయడానికి ఈరోజును జరుపుతున్నారు.
ఆర్థరైటిస్ డే చరిత్ర:
ప్రపంచ ఆర్థరైటిస్ డే ని మొదటిసారిగా 1996 సంవత్సరంలో జరుపుకున్నారు. ఆర్థరైటిస్ అండ్ రుమాటిజం ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారు ఆర్థరైటిస్ డే ని జరుపుకోవాలని 1996లో నిర్ణయించారు.
Details
ఆర్థరైటిస్ లక్షణాలు
కీళ్ల నొప్పులు:
ఆర్థరైటిస్ లో ప్రధానంగా కీళ్ల నొప్పులు ఉంటాయని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఆర్థరైటిస్ తో ఇబ్బంది పడే వారిలో ఎముకల జాయింట్లలో విపరీతమైన నొప్పి కలుగుతుంది.
ముఖ్యంగా ఉదయం పూట ఈ నొప్పి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
వాపు:
కీళ్ల దగ్గర నొప్పులు ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో వాపు కనిపిస్తుంది. ఇది కూడా ఆర్థరైటిస్ లక్షణమే.
ఉదయం పూట నొప్పి:
ఆర్థరైటిస్ తో బాధపడే వారిలో కొంతమంది ఉదయం పూట ఎక్కువ నొప్పిని అనుభవిస్తారు.
వర్షం పడే సమయంలో లేదా వాతావరణంలో తేమ పెరిగిపోయిన సమయంలో కూడా నొప్పి ఎక్కువగా ఉంటుంది.
Details
ఆర్థరైటిస్ కారణాలు, నివారణ మార్గాలు
ఆర్థరైటిస్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. కుటుంబ నేపథ్యం, వయస్సు, గతంలో ఎప్పుడైనా ఎముకల జాయింట్లకు గాయం కావడం, ఊబకాయం అధిక ఒత్తిడి వంటి కారణాలవల్ల ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది.
నివారణ మార్గాలు:
ఆర్థరైటిస్ రాకుండా ఉండాలంటే బరువు పెరగకుండా చూసుకోవాలి.
వ్యాయామం:
క్రమం తప్పకుండా సైక్లింగ్, వాకింగ్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు చేయడం వల్ల ఆర్థరైటిస్ రాకుండా ఉండే అవకాశం ఉంది. వ్యాయామం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి.
డైట్:
కాల్షియం అధికంగా ఉన్న పాలు, ఛీజ్, పెరుగు మొదలగు ఆహారాలను తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ రాకుండా నివారించవచ్చు. అలాగే పొగతాగడం కూడా మానేయాలి.