ప్రపంచ ఆస్తమా దినోత్సవం: చరిత్ర తెలుసుకోవాల్సిన విషయాలు, నియంత్రించే చిట్కాలు
ప్రతీ సంవత్సరం మే నెలలో వచ్చే మొదటి మంగళవారం రోజున ప్రపంచ ఆస్తమా (ఉబ్బసం) దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆస్తమా అనేది దీర్ఘకాలిక వ్యాధి. దీన్ని పూర్తిగా తగ్గించడానికి సరైన చికిత్స లేదు. కానీ ఆస్తమాతో కలిగే ఇబ్బందులను తొలగించి ఆనందకరమైన జీవితాన్ని పొందేందుకు కావలసిన మెడిసిన్లు అందుబాటులో ఉన్నాయి. ఆస్తమా మీద అందరికీ అవగాహన కల్పించడానికి అలాగే ప్రపంచ వేదికల మీద ఆస్తమా గురించి చర్చ జరగడానికి ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఆస్తమా అంటే ఆస్తమా అనేది ఊపిరితిత్తులకు చెందిన సమస్య. శ్వాసనాళాలు ఇరుకుగా మారిపోయి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు ఏర్పడతాయి. కొందరిలో ఒక్కోసారి శ్వాస పీల్చుకున్నప్పుడు ఒకలాంటి విజిల్ శబ్దం వస్తుంది.
ఆస్తమా ఇబ్బందిని తగ్గించే చిట్కాలు
ఈ సంవత్సరం ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని "అందరికీ ఆస్తమా నుండి రక్షణ" అనే థీమ్ తో నిర్వహిస్తున్నారు. ఆస్తమా అనేది దీర్ఘకాలిక సమస్య అయినప్పటికీ దీని నుండి నియంత్రించుకునే చిట్కాలు కూడా ఉన్నాయి, అవేంటో ఇక్కడ చూద్దాం. ఆస్తమాతో బాధపడేవారు ఖచ్చితంగా తమ వెంట ఇన్ హేలర్ ని ఉంచుకోవాలి. డాక్టర్లు సూచించిన మెడిసిన్ లను తప్పకుండా వాడాలి. వ్యక్తిగత శుభ్రత ఎల్లవేళలా పాటించాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే మంచిది. పక్కబట్టలను వారానికి ఒకసారి వేడి నీటిలో ఉతుక్కుంటే ఆస్తమా ఇబ్బంది నుండి ఉపశమనం కలుగుతుంది. దుమ్ము, ధూళి ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మాస్క్ వాడటం తప్పనిసరి. వంటింట్లో నుండి వచ్చే పోపు వాసనలకు దూరంగా ఉండాలి.