ప్రపంచ రక్తదాతల దినోత్సవం 2023: రక్తదానం చేస్తే గుండె సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయా?
ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం. ప్రతీ సంవత్సరం జూన్ 14వ తేదిన ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుతారు. రక్తదానం చేసి ప్రాణాలను కాపాడే దాతల సేవలను గుర్తించేందుకు, రక్తదానం ఎందుకు చేయాలో తెలియజేసేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుతారు. రక్తదానం చేయడం వల్ల అవతలి వారికే కాదు మీకు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గుండెపోటు రాకుండా కాపాడుతుంది: రక్తంలో ఐరన్ మరీ ఎక్కువైపోతే గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. తరచుగా రక్తదానం చేయడం వల్ల రక్తంలో ఐరన్ తగ్గిపోతుంది. దానివల్ల గుండెపోటు అవకాశాలు తగ్గుతాయి. రక్తంలో ఐరన్ అధికమయ్యే పరిస్థితిని హెమోక్రొమొటోసిస్ అంటారు. అంతేకాదు, రక్తహీనత మొదలగు ఇబ్బందులు కూడా రక్తదానం వల్ల బయటపడతాయి.
రక్తదానం చేస్తే పెరిగే రోగనిరోధక శక్తి
రోగనిరోధక శక్తి పెరుగుతుంది: రక్తంలో ఉండే ల్యూకోసైటులు రోగాల బారి నుండి కాపాడే రక్తకణాలు. రక్తదానం చేయడం వల్ల కొత్త రక్తం పుట్టుకొస్తుంది. అప్పుడు కొత్తగా ప్లాస్మా, ల్యూకోసైటులు పెరుగుతాయి. అందువల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు తగ్గుతారు: తరచుగా రక్తదానం చేయడం వల్ల బరువు తగ్గుతారు. అయితే ఒకసారి రక్తదానం చేసిన తర్వాత కనీసం 8వారాల వరకు మళ్ళీ రక్తదానం చేయకూడదు. కొన్నిచోట్ల 16వారాల వరకు చేయకూడదని చెబుతారు. క్యాన్సర్ రాకుండా ఉంటుంది: రక్తంలో ఐరన్ ఎక్కువైతే గుండెపోటు మాత్రమే కాదు క్యాన్సర్ కి గురయ్యే అవకాశం కూడా ఉంది. తరచుగా రక్తదానం చేయడం ఈ పరిస్థితి రాకుండా ఉండే అవకాశం ఉంది.