World Book Day 2026 : పుస్తకాలు మనసును తీర్చిదిద్దుతాయి… పఠనం సమాజాన్ని ముందుకు నడిపిస్తుంది
ఈ వార్తాకథనం ఏంటి
ఇల్లు ఎంత పెద్దదో కాదు... అందులో ఉన్న పుస్తకాలే ఆ ఇంటి విలువను నిర్ణయిస్తాయి. సమాజం ఎంత అభివృద్ధి చెందిందన్నది కాదు... అది ఎంత జ్ఞానంతో ముందుకు సాగుతోందన్నదే నిజమైన ప్రమాణం. ఇవి కేవలం భావోద్వేగపు మాటలు కావు; ఒక సుస్థిర నాగరిక సమాజ నిర్మాణానికి పునాది అయిన నిజాలు. ప్రతి సంవత్సరం జరుపుకునే ప్రపంచ పుస్తక దినోత్సవం మనకు ఇదే సందేశాన్ని గుర్తుచేస్తుంది. పుస్తకం తెరిస్తే మనసు తెరుచుకుంటుంది... జ్ఞానం వెలుగుతుంది... భవిష్యత్తు మెరుగవుతుంది. ప్రపంచాన్ని ముందుకు నడిపించిన శక్తివంతమైన సాధనం ఏదైనా ఉందంటే అది పుస్తకమే. మనిషి ఆలోచనలకు రూపం ఇచ్చింది, అనుభవాలను అక్షరాలుగా మార్చింది, తరతరాల జ్ఞానాన్ని తరలించింది పుస్తకం.
వివరాలు
పుస్తకం ఉన్న చోటే ప్రజ్ఞ ఉంటుంది
కాలం మారినా, సాంకేతికత ఎంత ముందుకు వెళ్లినా, పుస్తకానికి ఉన్న ప్రాముఖ్యత తగ్గదు. ఎందుకంటే పుస్తకం కేవలం కాగితం కాదు; అది గురువు, మిత్రుడు, మార్గదర్శి, నిశ్శబ్ద విప్లవం. మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు అతనికి తోడుగా నిలిచేది పుస్తకం. సందిగ్ధ పరిస్థితుల్లో దారి చూపేది పుస్తకం. సాధారణ వ్యక్తిని గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దేది కూడా పుస్తకమే. ఒక మంచి పుస్తకం ఆలోచనలను మార్చగలదు; ఒక గొప్ప పుస్తకం జీవిత దిశనే మార్చగలదు. అందుకే "పుస్తకం ఉన్న చోటే ప్రజ్ఞ ఉంటుంది" అన్న మాట నేటికీ నిజమే.
వివరాలు
పుస్తకాలు గతాన్ని, భవిష్యత్తును కలిపే వారధి
ప్రతి ఏడాది ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని జరుపుకుంటారు. పుస్తకాల ప్రాముఖ్యతను చాటి చెప్పడం, చదివే అలవాటును పెంపొందించడం, రచయితల కృషిని గౌరవించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశాలు. పుస్తకాలు గతాన్ని, భవిష్యత్తును కలిపే వారధిగా, తరాల మధ్య అనుసంధానంగా నిలుస్తాయి. అవి నిజ జీవితాన్ని అర్థం చేసుకోవడమే కాదు, కల్పిత ప్రపంచాలను సృష్టించే మనిషి సామర్థ్యానికి కూడా నిదర్శనం. భారతీయ సంస్కృతిలో పుస్తకాలకు అపార గౌరవం ఉంది. వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, భాగవతం వంటి గ్రంథాలు కేవలం ఆధ్యాత్మిక రచనలు మాత్రమే కాదు; అవి జీవన మార్గదర్శకాలు. ధర్మం, నీతి, సామాజిక బాధ్యత, మానవత్వం వంటి విలువలను తరతరాలకు అందించిన సంపద పుస్తకాలు .
వివరాలు
లోతైన ఆలోచనకు దారి పుస్తక పఠనం
తెలుగు సాహిత్యంలోనూ నన్నయ, తిక్కన, ఎఱ్ఱాప్రగడ నుండి గురజాడ, శ్రీశ్రీ, విశ్వనాథ, సినారె వరకు అనేక మంది మహనీయులు తమ రచనలతో సమాజాన్ని చైతన్యవంతం చేశారు. పుస్తకం మార్పుకు సాధనమని వారు నిరూపించారు. నేటి కాలంలో సమాచారం కొరత లేదు. మొబైల్ చేతిలోకి వచ్చిన తర్వాత ప్రపంచం మన ముందే నిలిచింది. ఒక్క స్పర్శతో ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అయితే సమాచారం పెరగడం వేరు, జ్ఞానం పెరగడం వేరు. తాత్కాలిక వినోదం, చిన్నచిన్న సందేశాలు మనసును ఆకట్టుకోవచ్చు గాని, లోతైన ఆలోచనకు దారి తీసేది మాత్రం పుస్తక పఠనం. పుస్తకం మనల్ని ఆలోచింపజేస్తుంది, ప్రశ్నలు రేకెత్తిస్తుంది, సమాధానాల కోసం లోతుగా వెతకడం నేర్పుతుంది.
వివరాలు
విద్యార్థి దశలో పఠనం వ్యక్తిత్వ నిర్మాణానికి కీలకం
పుస్తకాలను శ్రద్ధగా చదవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.భాషపై పట్టు మెరుగవుతుంది. విశ్లేషణాత్మక దృష్టి పెరుగుతుంది. సహనం, లోతైన ఆలోచన,అభిప్రాయ నిర్మాణం వంటి లక్షణాలు అలవడతాయి. ముఖ్యంగా విద్యార్థి దశలో పఠనం వ్యక్తిత్వ నిర్మాణానికి కీలకం. పరీక్షల కోసం మాత్రమే కాదు, జీవితాన్ని అర్థం చేసుకోవడానికి కూడా పుస్తకం చదవాలి. పాఠ్య పుస్తకాలు ఉపాధిని ఇవ్వొచ్చు;మంచి పుస్తకాలు జీవన దిశను నిర్దేశిస్తాయి. యువతలో చదివే అలవాటు తగ్గిపోతుందన్న ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. పుస్తకాలతో గడిపే సమయం తగ్గి,తెరల ముందు గడిపే సమయం పెరుగుతోంది. ఇది కేవలం అలవాట్ల మార్పు కాదు;ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసే పరిణామం. వేగవంతమైన సమాచార వినియోగం వల్ల లోతైన పఠనం తగ్గిపోతోంది. దాని ప్రభావంగా సహనం,విమర్శనాత్మక దృష్టి,భావవ్యక్తీకరణ సామర్థ్యం తగ్గుతున్నాయి.
వివరాలు
గ్రామాల్లోనూ ఆధునిక సదుపాయాలతో గ్రంథాలయాలు అవసరం
ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వాల బాధ్యత ఎంతో ఉంది. చిన్నప్పటి నుంచే పిల్లల్లో కథల పుస్తకాలు చదివే అలవాటు పెంచాలి. ప్రతి ఇంట్లో చిన్న గ్రంథాలయం ఉండాలి. పాఠశాలల్లో గ్రంథాలయాలను చురుకుగా ఉపయోగించాలి. విద్యార్థులు వారానికి కనీసం ఒక పుస్తకం చదివేలా ప్రోత్సహించాలి. పుస్తక సమీక్షలు,రచయితలతో ముఖాముఖి కార్యక్రమాలు, పఠన పోటీలు, సాహిత్య సభలు నిర్వహించాలి. పుస్తక పఠనాన్ని ఒక ఉత్సవంగా మార్చాలి. గ్రంథాలయాల ప్రాధాన్యతను మరచిపోలేం. ఒక మంచి గ్రంథాలయం అంటే అది ఒక ప్రాంతానికి జ్ఞాన కేంద్రం. అక్కడ పుస్తకాలతో పాటు ఆలోచనలు కూడా పెరుగుతాయి. పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లోనూ ఆధునిక సదుపాయాలతో గ్రంథాలయాలు అవసరం.
వివరాలు
హృదయానికి చేరువగా మాతృభాషలో చదివిన జ్ఞానం
కాలానికి అనుగుణంగా ఈ-లైబ్రరీలు, ఆడియో బుక్స్, మొబైల్ లైబ్రరీలు అందుబాటులోకి రావాలి. తెలుగు పుస్తకాల ప్రోత్సాహం అత్యంత అవసరం. మాతృభాషలో చదివిన జ్ఞానం హృదయానికి చేరువగా ఉంటుంది. అది భావోద్వేగానికి,సంస్కృతికి,సామాజిక చైతన్యానికి బలమైన పునాది. తెలుగు రచయితలను ప్రోత్సహించాలి. స్థానిక చరిత్ర,సంస్కృతి,విజ్ఞానం,సామాజిక అంశాలపై మరిన్ని రచనలు రావాలి. కొత్త రచయితలకు అవకాశాలు కల్పించాలి. ప్రచురణ రంగానికి ప్రభుత్వ మద్దతు అవసరం. పుస్తక ప్రదర్శనలు మరింత విస్తరించాలి. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మనసులో ఒక ప్రశ్న వేసుకోవాలి.. గత ఏడాదిలో ఎన్ని పుస్తకాలు చదివాం?ఎన్ని పిల్లలకు పుస్తకాలు బహుమతిగా ఇచ్చాం?మొబైల్‌కు కేటాయించే సమయం లో కొంతైనా పుస్తకాలకు కేటాయిస్తున్నామా? ఈ ప్రశ్నలకు నిజాయితీగా ఇచ్చే సమాధానాలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి.
వివరాలు
గొప్ప రచయితలు కాలాన్ని జయిస్తారు
పుస్తకం మనిషికి నిజమైన తోడు. కష్టాల్లో ధైర్యం ఇస్తుంది. సందేహాల్లో మార్గం చూపుతుంది. విజయానికి ప్రేరణ ఇస్తుంది. అపజయంలో ఆదుకుంటుంది. మనిషి లేకపోయినా అతని ఆలోచనలు చిరస్థాయిగా నిలిచే మార్గం పుస్తకం. అందుకే గొప్ప రచయితలు కాలాన్ని జయిస్తారు. పుస్తకం మనిషిని తనకే కాదు, సమాజానికి ఉపయోగపడేలా ఆలోచింపజేస్తుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ నెలకు కనీసం ఒక పుస్తకం చదవాలని సంకల్పించాలి.
వివరాలు
సమాజంలో పఠన సంస్కృతిని మళ్లీ బలోపేతం చేయాలి
ప్రత్యేక సందర్భాల్లో పుస్తకాలను బహుమతిగా ఇవ్వాలి. పిల్లలలో పఠన అలవాటును పెంపొందించాలి. చదివిన విషయాలను కుటుంబంతో పంచుకోవాలి. సమాజంలో పఠన సంస్కృతిని మళ్లీ బలోపేతం చేయాలి. చివరగా చెప్పాలంటే... ఇల్లు ఎంత పెద్దదో కాదు, అందులో ఉన్న పుస్తకాలే అసలు విలువ. సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కాదు, అది ఎంత చదువుతో ముందుకు సాగుతోందో అదే నిజమైన ప్రమాణం. ఎందుకంటే పుస్తకం ఉన్న చోటే ప్రజ్ఞ ఉంటుంది; పఠనం ఉన్న చోటే పురోగతి ఉంటుంది; జ్ఞానం ఉన్న చోటే నిజమైన స్వేచ్ఛ ఉంటుంది.