వరల్డ్ ఎమోజీ డే 2023: అసలు ఎమోజీలు ఎక్కడ పుట్టాయి? ఎక్కువగా వాడుతున్న ఎమోజీ ఏది?
ఇప్పటి తరానికి మాట్లాడలేని కొత్త భాష పుట్టుకొచ్చింది. అదే ఎమోజీ భాష. నోరు విప్పి మాట్లాడుకోవడం తగ్గించిన మనుషుల భావాలను మాటల్లో కాకుండా బొమ్మల్లో అర్థం చేసుకోవడమే ఎమోజీ లాంగ్వేజ్. ఈరోజు ప్రపంచ ఎమోజీ దినోత్సవం. ప్రతీ సంవత్సరం జులై 17వ తేదీన ఎమోజీ దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమోజీల గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. అసలు ఎమోజీలు ఎలా పుట్టుకొచ్చాయో తెలుసా? ఎమోజీలను సృష్టించింది జపాన్ దేశస్థులు. ఎమోజీలను ఎక్కువగా పాపులర్ చేసింది మాత్రం ఆపిల్ సంస్థ. 2011లో ఐఫోన్ కీబోర్డ్ లో ఎమోజీస్ అందుబాటులోకి వచ్చాయి. అప్పటి నుండి మొబైల్ ఫోన్ కంపెనీలన్నీ తమ ఫోన్లలో ఎమోజీ కీబోర్డును తీసుకొచ్చాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా వాడుతున్న ఎమోజీలు
2013లో ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో ఎమోజీ అనే పదం చోటు దక్కించుకుంది. ఎమోజీ అనేది జపనీస్ పదం. ఎమోజీ అంటే ఎ(చిత్రం)+మోజీ(క్యారెక్టర్) అని అర్థం. సోషల్ మీడియాలో ఎక్కువ మంది వాడుతున్న ఎమోజీగా, ఆనందంతో కన్నీళ్ళు కార్చే బొమ్మ మొదటి స్థానంలో ఉంది. గత మూడేళ్ళుగా ఈ ఎమోజీనే టాప్ లో ఉంది. రెడ్ హార్ట్, కళ్ళలో హార్ట్ సింబల్స్, పింక్ హార్ట్ సింబల్స్ అనేది రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎమోజీ లాంగ్వేజ్ అనేది వేగంగా పెరుగుతున్న భాషగా 2015లో పేరు తెచ్చుకుంది. గతంలో ఎమోజీస్ చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు రకరకాల ఎమోజీస్ తయారవుతూనే ఉన్నాయి. కొత్త కొత్త ఎమోజీస్ ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయి.