వరల్డ్ రైనో డే: ఖడ్గమృగాలు వాటి మూత్రం, పేడ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయని తెలుసా?
భూమి మీద ఖడ్గమృగాలను అంతరించిపోకుండా చూడడానికి ఈరోజును జరుపుతున్నారు. ప్రస్తుతం భూమి మీద చాలా తక్కువ ఖడ్గమృగాలు బ్రతికి ఉన్నాయి. మనుషులు వాటిని వేటాడటం, ఇంకా అనేక కారణాల వల్ల ఖడ్గమృగాలు అంతరించిపోయే దశకు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఖడ్గమృగాలను కాపాడడానికి, వాటి సంఖ్యను పెంచే ఉద్దేశంతో ప్రతీ సంవత్సరం ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం జరుపుతున్నారు. 1990 సంవత్సరం నుండి ఖడ్గమృగాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2010 సంవత్సరం నాటికి వాటి సంఖ్య కేవలం 30వేలకు చేరుకుంది. దీంతో వరల్డ్ రైనో డే జరుపుకోవడం మొదలుపెట్టారు. ఖడ్గమృగాలకు సంబంధించిన కొన్ని నిజాలు ఖడ్గమృగాల్లో మొత్తం ఐదు జాతులు ఉంటాయి. బ్లాక్, వైట్, ఇండియన్, జావన్, సుమత్రన్.
మూత్రం, పేడతో కమ్యూనికేట్ చేసుకునే ఖడ్గమృగాలు
ఖడ్గమృగాల్లోని ప్రతీ జాతి దేనికదే భిన్నంగా ఉంటుంది. ఐదు జాతుల ఖడ్గమృగాల అలవాట్లు విభిన్నంగా ఉంటాయి. ఈ ఐదు జాతుల్లో జావన్, సుమత్రన్ జాతులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ఖడ్గమృగాల కొమ్ములో ఔషధం ఉందని చాలామంది నమ్ముతారు. కానీ ఇది నిజం కాదని నిపుణులు చెబుతున్నారు. మనుషుల చేతి వేళ్ళ గోర్లు కెరాటిన్ అనే పదార్థంతో తయారైనట్టుగానే ఖడ్గమృగాల కొమ్ము తయారవుతుంది. ఖడ్గమృగాలు వింత వింత శబ్దాలతో కమ్యూనికేట్ చేసుకుంటాయి. అంతేకాదు అవి వాటి పేడ, మూత్రం ద్వారా కూడా ఒకదానికొకటి కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఖడ్గమృగాలు బురదలో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతాయి. ఖడ్గమృగాలకు కంటిచూపు బలహీనంగా ఉంటుంది. కానీ వినికిడి శక్తి ఎక్కువగా ఉంటుంది.