వ్యాయామం చేసిన తర్వాత శరీరానికి ప్రశాంతతను అందించడానికి చేయాల్సిన యోగాసనాలు
వ్యాయామానికి ముందు శరీరాన్ని వేడి చేసుకోవడానికి వార్మప్ ఎలా చేస్తామో వ్యాయామం తర్వాత శరీరానికి ప్రశాంతతను అందించడానికి కొన్ని ఎక్సర్ సైజెస్ అవసరం అవుతాయి. అయితే ప్రస్తుతం శరీరానికి ప్రశాంతతను అందించే యోగాసనాలు ఎలా వేయాలో తెలుసుకుందాం. బాలాసనం: మోకాళ్ళ మీద కూర్చుని నడుము కిందకు వంచి తలను నేలకు ఆనించాలి. చేతులను తలకు సమాంతరంగా నేలకు తాకేవిధంగా చాపాలి. ఈ స్థితిలో మూడు నిమిషాలుండాలి. దీనివల్ల మీ మెదడు, నరాలు రిలాక్స్ అవుతాయి. పశ్చిమోత్థాసనం: నేల మీద కాళ్ళను ముందు చాపి కూర్చోవాలి. ఇప్పుడు తలను మోకాళ్ళ దగ్గరకు వంచాలి. అలాగే మీ చేతులతో కాలి బొటనవేళ్లను పట్టుకోవాలి. ఈ ఆసనం వల్ల మీ నడుము, చేతులు, కాళ్ళకు ప్రశాంతత లభిస్తుంది.
శరీరానికి ప్రశాంతతను అందించే యోగాసనాలు
భుజంగాసనం: బోర్లా పడుకుని భుజాల పక్కన అరచేతులను ఆనించి, కేవలం నడుము భాగం వరకు మాత్రమే పైకి లేపాలి. ఈ పొజిషన్ లో 20-30సెకన్ల పాటు ఉండాలి. ఇలా కొన్నిసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. సేతు బంధ సర్వాంగసనం: వెల్లకిలా పడుకుని మోకాళ్ళను వంచాలి. కుడి చేతిలో కుడి కాలి మడమను, ఎడమ చేతితో ఎడమ కాలి మడమను పట్టుకుని తల భాగాన్ని నేలమీదే ఉంచి, నడుము భాగాన్ని గాల్లోకి లేపాలి. విపరీత కారణి: గోడకు ముఖం చేస్తూ దగ్గరగా కూర్చోండి. ఇప్పుడు కాళ్ళను పైకి లేపాలి. ఆ తర్వాత నడుము భాగాన్ని కూడా లేపి మీ చేతులతో నడుము భాగాన్ని పట్టుకోండి. దీనివల్ల శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది.