LOADING...
100GW wind power grid:నార్త్ సీలో చారిత్రాత్మక ఒప్పందం..100GW విండ్ పవర్ గ్రిడ్‌కు 10 యూరప్ దేశాలు గ్రీన్ సిగ్నల్
100GW విండ్ పవర్ గ్రిడ్‌కు 10 యూరప్ దేశాలు గ్రీన్ సిగ్నల్

100GW wind power grid:నార్త్ సీలో చారిత్రాత్మక ఒప్పందం..100GW విండ్ పవర్ గ్రిడ్‌కు 10 యూరప్ దేశాలు గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 26, 2026
02:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

యూరప్‌లో 10 దేశాలు కలిసి భారీ స్థాయి ఆఫ్‌షోర్ విండ్ పవర్ గ్రిడ్ నిర్మించేందుకు సిద్ధమవుతున్నాయి. ఉత్తర సముద్రం(నార్త్ సీ)కేంద్రంగా 100 గిగావాట్ల సామర్థ్యంతో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నారు. యూకే సహా మరో తొమ్మిది యూరోపియన్ దేశాలు ఈ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు సమాచారం. పాత చమురు క్షేత్రంగా ఉన్న నార్త్ సీని పూర్తిగా శుభ్రమైన ఇంధన కేంద్రంగా మార్చడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యంగా ఉంది. ఈ ప్రణాళిక ప్రకారం సముద్రంలో భారీ విండ్ ఫార్మ్‌లు ఏర్పాటు చేసి,హై వోల్టేజ్ సబ్‌సీ కేబుల్స్ ద్వారా ఒకేసారి పలు దేశాలకు నేరుగా విద్యుత్ సరఫరా చేయనున్నారు. ఈ గ్రిడ్ ద్వారా 100 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా.

వివరాలు 

సుమారు 14.3 కోట్ల ఇళ్లకు సరిపడా విద్యుత్ సామర్థ్యానికి సమానం

ఇది సుమారు 14.3 కోట్ల ఇళ్లకు సరిపడా విద్యుత్ సామర్థ్యానికి సమానం కావడం విశేషం. ఈ ఒప్పందానికి సంబంధించి రూపొందించిన "హాంబర్గ్ డిక్లరేషన్" ద్వారా ఆయా దేశాల కట్టుబాటును అధికారికంగా ప్రకటించనున్నారు. యూకే, బెల్జియం, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఐస్లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే దేశాల ఎనర్జీ మంత్రులు ఈ రోజు దీనిపై సంతకాలు చేసే అవకాశం ఉంది. యూకే ఎనర్జీ సెక్రటరీ ఎడ్ మిలిబ్యాండ్ మాట్లాడుతూ, శుభ్రమైన ఇంధనాన్ని ప్రోత్సహించడం ద్వారా దేశ ప్రయోజనాలను కాపాడుతున్నామని, ఫాసిల్ ఫ్యూయల్స్‌పై ఆధారపడే పరిస్థితి నుంచి బయటపడుతున్నామని తెలిపారు.

వివరాలు 

యూరప్ అంతటా విండ్ మిల్లులు ఉన్నాయి, అవన్నీ నష్టాలే

ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల యూకే నార్త్ సీలో చమురు, వాయువు ఉత్పత్తిని తగ్గించే ప్రణాళికలను తీవ్రంగా విమర్శించారు. యూరప్‌లో విండ్ పవర్‌పై కూడా ఆయన విమర్శలు గుప్పిస్తూ, "యూరప్ అంతటా విండ్ మిల్లులు ఉన్నాయి, అవన్నీ నష్టాలే" అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలను పట్టించుకోకుండా యూరప్ దేశాలు విండ్ ఎనర్జీపై తమ నిబద్ధతను మరోసారి చాటుకున్నాయి. మూడేళ్ల క్రితమే నార్త్ సీ దేశాలు 2050 నాటికి 300 గిగావాట్ల ఆఫ్‌షోర్ విండ్ పవర్ లక్ష్యంగా ఒప్పందం చేసుకున్నాయి. తాజా గ్రిడ్ ప్రాజెక్ట్ ఆ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించనుంది.

Advertisement

వివరాలు 

2030 నాటికి పూర్తిగా శుభ్రమైన విద్యుత్ వ్యవస్థ

ఇక యూరోపియన్ యూనియన్‌లో గత ఏడాది కీలక మార్పు చోటు చేసుకుంది. విండ్, సోలార్ పవర్ ఉత్పత్తి ఫాసిల్ ఫ్యూయల్స్‌ను మించి 30 శాతం విద్యుత్‌ను అందించింది. ఇదే ధోరణిలో యూకే ప్రభుత్వం తాజాగా ఆఫ్‌షోర్ విండ్ ప్రాజెక్టులకు రికార్డు స్థాయిలో సబ్సిడీ కాంట్రాక్టులను మంజూరు చేసింది. 2030 నాటికి పూర్తిగా శుభ్రమైన విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న యూకే లక్ష్యానికి ఇది కీలక ముందడుగుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement