Cosmic Explosion: 13,000 ఏళ్ల క్రితం భూమిపై జరిగిన పేలుడు వల్లే మంచు యుగం మళ్లీ వచ్చిందా?
ఈ వార్తాకథనం ఏంటి
సుమారు 13,000 సంవత్సరాల క్రితం భూమిపై ఒక భారీ ఆకాశ పేలుడు జరిగినట్లు తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. ఆ ఘటన తర్వాత ఒక పెద్ద తెగ అదృశ్యమైపోవడం, అలాగే మామత్‌లు, మాస్టడాన్‌లు వంటి భారీ జంతువులు అంతరించిపోవడం కూడా ఇదే కాలానికి చెందాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్లైస్టోసీన్ చివరి దశలో వాతావరణం వేడెక్కడం మొదలయ్యే సమయంలో, అకస్మాత్తుగా పరిస్థితులు మళ్లీ మంచు యుగ పరిస్థితులకు చేరి, దాదాపు వెయ్యేళ్ల పాటు కొనసాగాయి. ఈ ఆకస్మిక వాతావరణ మార్పుకు కారణం.. విడిపోయిన ధూమకేతువు వాతావరణంలో పేలిపోవడంతో ఏర్పడ్డ తీవ్రమైన వేడి, షాక్‌వేవ్‌లేనని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పేలుడు ఉత్తర అమెరికాలోని "క్లోవిస్" సంస్కృతి ఒక్కసారిగా కనిపించకపోవడానికి కూడా కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.
వివరాలు
క్లోవిస్ తెగ అదృశ్యానికి కారణం 'కాస్మిక్ ఎక్స్‌ప్లోషన్'
పరిశోధకుల ప్రకారం, అమెరికాలోని మూడు ముఖ్యమైన క్లోవిస్ ప్రాంతాలైన అరిజోనాలోని ముర్రే స్ప్రింగ్స్, న్యూ మెక్సికోలోని బ్లాక్వాటర్ డ్రా, కాలిఫోర్నియా ఛానల్ ఐలాండ్స్‌లోని ఆర్లింగ్టన్ కెన్యాన్ ప్రాంతాల్లో తీవ్ర వేడి, ఒత్తిడితో రూపం మారిన "షాక్‌డ్ క్వార్ట్జ్" కనుగొనడం ప్రధాన ఆధారంగా నిలిచింది. ఇవే ప్రాంతాలు భారీ జంతువులు అంతరించిపోయిన విషయం, అలాగే క్లోవిస్ సంస్కృతి ముగిసిన అంశాన్ని మొదట గుర్తించిన కీలక స్థలాలు అని పరిశోధకులు చెబుతున్నారు. యువర్ డ్రయాస్ కాలంలో భూమి ఒక్కసారిగా చల్లబడింది.ధూమకేతువు వాతావరణంలో పగిలిపోవడంతో భారీ వేడి,దుమ్ము,పొగ, సూట్ వ్యాపించి, చివరికి సూర్యకాంతి తగ్గిపోయి "ఇంపాక్ట్ వింటర్" పరిస్థితి ఏర్పడింది. ఇదే భారీ జంతువుల అంతరించిపోవడం, క్లోవిస్ తెగ అదృశ్యమవడం వంటి సంఘటనలకు దారితీసిందని శాస్త్రవేత్తల అభిప్రాయం.