
Shubhanshu Shukla: భూమికి 22.5 గంటల ప్రయాణం.. శుభాంశు శుక్ల శుభ యాత్ర ప్రారంభం!
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశం అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయాన్ని శుభాంశు శుక్ల రాయనున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి ఆయనతో పాటు 'ఆక్సియం మిషన్-4'లో పాల్గొన్న మరో ముగ్గురు అంతరిక్షయాత్రికులు నేడు భూమికి తిరిగి రానున్నారు. జూలై 14 (ఆదివారం) సాయంత్రం 4:30కి (IST) డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ ఐఎస్ఎస్ నుంచి విడిపోతుంది. తిరుగు ప్రయాణం అనంతరం జూలై 15 మధ్యాహ్నం 3 గంటలకు అమెరికా కాలిఫోర్నియాకు సమీపంగా పసిఫిక్ మహాసముద్రంలో స్ప్లాష్‌డౌన్ కానుంది. మొత్తం ప్రయాణం 22.5 గంటలు ఉంటుంది.
Details
శుభాంశు శుక్ల - భారత అంతరిక్ష యాత్రలో సరికొత్త అధ్యాయం
శుభాంశు శుక్ల భారతదేశానికి చెందిన మొదటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర సందర్శకుడిగా గుర్తింపు పొందారు. 1984లో స్పేస్‌లోకి వెళ్లిన తొలి భారతీయుడు వింగ్ కమాండర్ రాకేష్ శర్మ తర్వాత శుక్లే రెండవ భారతీయుడు. ఆయన ఈసారి 14 రోజుల పాటు ఐఎస్ఎస్‌లో శాస్త్రీయ పరిశోధనలతో పాటు అనేక ప్రయోగాల్లో పాల్గొన్నారు.
Details
భూమికి తిరిగే వచ్చేటప్పుడు ప్రయాణం ఎలా ఉంటుంది?
ఆక్సియం-4 బృందం జూన్ 25న అమెరికాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయాణం ప్రారంభించి, 28 గంటల ప్రయాణం తర్వాత జూన్ 26న ఐఎస్ఎస్‌కు చేరింది. తిరిగి ప్రయాణించేందుకు ముందు, డ్రాగన్ క్యాప్సూల్‌ను పరీక్షించడం, సరఫరా చేయాల్సిన సామగ్రిని లోడ్ చేయడం, అంతరిక్ష వాతావరణం నిలుపుకునేలా హచ్‌ను మూసివేయడం వంటి కార్యకలాపాలు చేపడతారు. అనంతరం, స్పేస్‌క్రాఫ్ట్ నావిగేషన్, ప్రొపల్షన్ వ్యవస్థలను సిద్ధం చేసి, స్వయంచాలకంగా విడదీయబడే విధంగా వ్యవస్థను అమర్చుతారు. ఈ సమయంలో 'Burn Zero' అనే చిన్న ఇంధన ప్రవాహం ద్వారా డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ ఐఎస్ఎస్ నుంచి గాడిలోకి వస్తుంది. మొత్తం ప్రయాణం చివర్లో స్ప్లాష్‌డౌన్ సమయంలో, స్పేస్‌క్రాఫ్ట్ పసిఫిక్ మహాసముద్రంలో నీటిలో దిగుతుంది.
Details
శుభాంశు శుక్ల భావోద్వేగ సందేశం
తిరుగు ప్రయాణానికి ముందు ఐఎస్ఎస్‌లో ఫేర్‌వెల్ కార్యక్రమం జరిగింది. ఇందులో శుభాంశు శుక్ల మాట్లాడుతూ ఇది ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ మిషన్‌లో భాగంగా ప్రతి వ్యక్తి చేసిన కృషి వలనే ఇది సాధ్యమైందన్నారు. ఈ రోజు మన భారతదేశం అంతరిక్షం నుంచి చూస్తే నమ్మశక్యంగా, ధైర్యంగా, గర్వంగా, ఆశయంగా కనిపిస్తోంది. మన ప్రయాణం ఇంకా చాలా పొడవైనదే అయినా.. మన నిశ్చయంతో నక్షత్రాల దాకా వెళ్లగలమని నమ్ముతున్నాను," అన్నారు. "ఈ అవకాశాన్ని ఇచ్చిన ISROకి, NASAకి, అలాగే Axiom Space, SpaceX సంస్థలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలని తెలిపారు.
Details
మిషన్‌లో కీలక ప్రయోగాలు
Ax-4 మిషన్‌లో భాగంగా 60కి పైగా ప్రయోగాలు నిర్వహించారు. వీటిలో బయోమెడికల్ సైన్స్, న్యూరో సైన్స్, వ్యవసాయ పరిశోధనలు, స్పేస్ టెక్నాలజీ తదితర రంగాలకు సంబంధించిన పరిశోధనలున్నాయి. డయాబెటిస్, క్యాన్సర్ చికిత్స, మానవ ఆరోగ్యంపై గమనికల విషయంలో ఈ ప్రయోగాలు కీలకంగా నిలవనున్నాయి. అంతేకాకుండా, 'ముంగ్' 'మెంతి' గింజల మొలకలను గమనిస్తూ శుభాంశు శుక్ల ఫోటోలు తీశారు. అవి భూమికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక ఫ్రీజర్‌లో భద్రపరిచారు.