భూమికి దగ్గరగా వస్తున్న వస్తున్న 50,000 సంవత్సరాల తోకచుక్క
అతి అరుదైన తోకచుక్క త్వరలో భూమికి దగ్గరగా రాబోతుందని ఖగోళ శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 50,000 సంవత్సరాలలో మొదటిసారిగా, తోకచుక్క C/2022 E3 ZTF ఫిబ్రవరి 1న మన గ్రహానికి అత్యంత సమీపంగా వస్తుంది. తోకచుక్కలు రాత్రిపూట ఆకాశంలో కనిపించడం తరచుగా జరగదు. వీటిని "కాస్మిక్ స్నో బాల్స్" అని కూడా పిలుస్తారు, తోకచుక్కలు ఘనీభవించిన వాయువు, ధూళి, రాళ్లతో తయారయి సూర్యుని చుట్టూ తిరుగుతాయి. ఈ తోకచుక్క C/2022 E3 ZTF సూర్యుని చుట్టూ తిరగడానికి 200 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి దీనిని దీర్ఘకాల తోకచుక్కగా విభజిస్తారు. ఇది విస్తృత-క్షేత్ర ఖగోళ అబ్జర్వేటరీ అయిన జ్వికీ ట్రాన్సియెంట్ ఫెసిలిటీ (ZTF) ద్వారా మార్చి 2022లో కనుగొన్నారు.
భూమికి 42 మిలియన్ కిలోమీటర్లు దూరంలో వస్తుంది ఈ తోకచుక్క
నాసా ఇటీవలి పరిశీలనలు చేసిన తర్వాత దీనికి ఆకుపచ్చని తల, పొట్టిగా విశాలమైన దుమ్ము తోక, పొడవైన మందమైన అయాన్ తోక ఉన్నట్లు వెల్లడించింది. ఇది ప్రస్తుతం అంతర్గత సౌర వ్యవస్థ గుండా వెళుతోంది. జనవరి 12న సూర్యునికి అత్యంత సమీప బిందువు దగ్గరకు వచ్చే అవకాశముంది. ఫిబ్రవరి 1న భూమికి 42 మిలియన్ కిలోమీటర్లు దూరంలో వస్తుంది. 2020 లో NEOWISE అనే తోకచుక్క చివరిగా గుర్తించబడింది. ఉత్తర అర్ధగోళం నుండి తెల్లవారుజామున సమయంలో తోకచుక్క బాగా కనిపిస్తుంది. ఆకాశంలో మసకబారిన, ఆకుపచ్చని మరక లాంటి వస్తువు ఏమైనా కనపడితే అదే ఈ తోకచుక్క. మెరుగ్గా కనిపించాలంటే బైనాక్యులర్‌లు లేదా టెలిస్కోప్‌ని ఉపయోగించవచ్చు లేదా ఆన్‌లైన్‌లో కూడా చూడవచ్చు.