Page Loader
China: 9 గంటల స్పేస్ వాక్‌.. చైనా వ్యోమగాముల రికార్డు ఘనత
9 గంటల స్పేస్ వాక్‌.. చైనా వ్యోమగాముల రికార్డు ఘనత

China: 9 గంటల స్పేస్ వాక్‌.. చైనా వ్యోమగాముల రికార్డు ఘనత

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 18, 2024
04:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతరిక్ష పరిశోధనలో చైనా మరో కీలక మైలురాయిని చేరుకుంది. డ్రాగన్ వ్యోమగాములు కై షూఝె, సాంగ్ లింగ్‌డాంగ్‌లు 9 గంటలపాటు స్పేస్‌ వాక్ చేసి విశేషమైన ఘనతను సొంతం చేసుకున్నారు. వారు షెంఝూ-19 అంతరిక్ష నౌక బృందానికి చెందినవారు. చైనా రూపొందించిన రెండో తరం ఫెయిటియాన్ స్పేస్ సూట్స్ ధరించి ఈ అరుదైన ప్రయోగాన్ని విజయవంతం చేశారు. ఈ వివరాలను చైనా మ్యాన్‌డు స్పేస్ ఏజెన్సీ (సీఎంఎస్‌ఏ) అధికారికంగా వెల్లడించింది. విశ్వ వ్యోమనౌక 'తియాంగాంగ్ స్పేస్ స్టేషన్' నుంచి బయలుదేరిన కై షూఝె, సాంగ్ లింగ్‌డాంగ్‌ల ఈ సాహసాన్ని రోబోటిక్ కెమెరాలు చిత్రీకరించి బీజింగ్ ఏరోస్పేస్ కంట్రోల్ సెంటర్‌కి పంపించాయి.

Details

మొదట 20 నిమిషాలు స్పేస్ వాక్

సాంగ్ లింగ్‌డాంగ్ తన వినూత్న ఘనతతో చైనాలో 1990ల తర్వాత జన్మించిన వారిలో స్పేస్ వాక్ చేసిన తొలి వ్యోమగామిగా నిలిచారు. ఇదే సమయంలో కై షూఝెకు ఇది రెండోసారి స్పేస్ వాక్ కావడం విశేషం. 2022లో ఆయన 5.5 గంటలపాటు స్పేస్ వాక్ చేసి అప్పట్లోనే తన ప్రతిభను చాటుకున్నారు. చైనా వ్యోమగాములు తొలిసారి 2008లో కేవలం 20 నిమిషాలపాటు స్పేస్ వాక్ చేశారు. అప్పుడు ప్రారంభమైన ప్రయాణం ఇప్పుడు మరింత దూరం వెళ్లింది. గతంలో షెంఝూ-18 మిషన్‌లో వ్యోమగాములు యె గాంగ్‌ఫూ, లి గువాంగ్‌సులు 8.23 గంటల స్పేస్ వాక్ చేసి అరుదైన రికార్డును నమోదు చేశారు. తాజాగా షెంఝూ-19 మిషన్‌లో ఈ రికార్డు కూడా అధిగమించారు.

Details

గతంలో 8.56 గంటల పాటు స్పేస్ వాక్

ఇంతకుముందు 2001 మార్చి 12న అమెరికా వ్యోమగాములు జేమ్స్ వూస్‌, సుసాన్ హల్మ్సెలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మిషన్‌లో 8.56 గంటలపాటు స్పేస్ వాక్ నిర్వహించారు. అయితే ఇప్పుడు చైనా ఈ రికార్డును అధిగమించింది. షెంఝూ-19 మిషన్‌లో కై షూఝె, సాంగ్ లింగ్‌డాంగ్‌లు 9 గంటలపాటు చేపట్టిన స్పేస్ వాక్, అంతరిక్ష పరిశోధనలో చైనాకు మరో గర్వకారణంగా నిలిచింది. కై షూఝె, సాంగ్ లింగ్‌డాంగ్‌లు అక్టోబర్ చివర్లో తియాంగాంగ్ స్పేస్ స్టేషన్‌కు చేరుకున్నారు. విదేశాల నుంచి అధునాతన సాంకేతికతను కొనుగోలు చేయకుండా, పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఫెయిటియాన్ స్పేస్ సూట్స్ చైనా వ్యోమగాములకు అత్యుత్తమ రక్షణ కల్పించాయి.