భూమికి కొత్త ముప్పు; నక్షత్రాలు పేలి ధరణిపైకి దూసుకొస్తున్న ప్రమాదకర ఎక్స్-కిరణాలు
ఖగోళ శాస్త్రవేత్తలు భూ గ్రహానికి కొత్త ముప్పును గుర్తించారు. పేలిన నక్షత్రాల నుంచి ఉత్పన్నమయ్యే ఎక్స్-కిరణాలు భూమితో సహా 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్రహాలను తీవ్రంగా ప్రభావితం చేసే దశ రావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పేలిన నక్షత్రాలు మునుపటి కంటే గ్రహాలకు ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తాయని, ప్రమాదకర రసాయనాలను విడుదల చేస్తాయని అధ్యయనానికి నాయకత్వం వహించిన ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇయాన్ బ్రంటన్ తెలిపారు. చంద్ర ఎక్స్-రే అబ్జర్వేటరీ, ఇతర టెలిస్కోప్‌లను ఉపయోగించి ఖగోళ శాస్త్రవేత్తలు ఈ ప్రమాదాన్ని గుర్తించారు.
ఎక్స్-కిరణాల ధాటికి తుడిచిపెట్టుకుపోనున్న ఓజోన్ పొర
నక్షత్రాల పేలడం వల్ల పెద్ద మొత్తంలో ఎక్స్-కిరణాలను ఉత్పత్తి అవుతాయని శాస్త్రవేత్తలు చెప్పారు. పేలుడు జరిగిన నెలల నుంచి సంవత్సరాలు లేదా దశాబ్దాల తర్వాత భూ గ్రహానికి ఆ ప్రమాదకర కిరణాలు చేరుకుంటాయని అధ్యయనంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎక్స్-కిరణాల భూమివైపు ప్రవహిస్తే సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలను అడ్డుకునే ఓజోన్ పొర పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. అంతరిక్షంలో సూపర్నోవాలుగా మారిన 31నక్షత్రాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. 160 కాంతి సంవత్సరాల దూరంలో సూపర్నోవాలు పేలితే భూమికి రేడియేషన్ ముప్పు ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. నక్షత్రాలు పేలడం వల్ల భూమికి ఇప్పటికిప్పుడు ఎటువంటి ప్రమాదం లేదని శాస్త్రవేత్త కానర్ ఓమహోనీ అన్నారు. ఎందుకంటే ఎక్స్-రే ప్రమాద జోన్‌లో సూపర్‌నోవాలు ఏవీ లేవని చెప్పారు.