LOADING...
Earth-sized new planet: భూమికి 146 కాంతి సంవత్సరాల దూరంలో కొత్త గ్రహం… జీవానికి అవకాశం ఉందా?
భూమికి 146 కాంతి సంవత్సరాల దూరంలో కొత్త గ్రహం… జీవానికి అవకాశం ఉందా?

Earth-sized new planet: భూమికి 146 కాంతి సంవత్సరాల దూరంలో కొత్త గ్రహం… జీవానికి అవకాశం ఉందా?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 29, 2026
02:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

భూమికి దగ్గరగా జీవం ఉండే అవకాశాలున్న కొత్త గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్‌ 70 డిగ్రీల సెల్సియస్‌ వరకు పడిపోయే అవకాశముందని చెబుతున్నారు. ఖగోళ శాస్త్రవేత్తలు భూమి నుంచి సుమారు 146 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక కొత్త గ్రహాన్ని కనుగొన్నారు. ఈ గ్రహం పరిమాణంలో భూమితో సమానంగా ఉండటంతో పాటు, పరిస్థితులు కొంతవరకు మంగళగ్రహాన్ని పోలి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ గ్రహానికి 'HD 137010 b' అనే పేరు పెట్టారు. ఇది సూర్యుడిలాంటి ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతుండగా, భూమికంటే దాదాపు 6 శాతం పెద్దదిగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

వివరాలు 

గ్రహాన్ని గుర్తించిన అంతర్జాతీయ బృందం

ఆస్ట్రేలియా, బ్రిటన్‌, అమెరికా, డెన్మార్క్‌కు చెందిన శాస్త్రవేత్తలతో కూడిన అంతర్జాతీయ బృందం ఈ గ్రహాన్ని గుర్తించింది. 2017లో నాసా కెప్లర్‌ అంతరిక్ష టెలిస్కోప్‌ విస్తృత మిషన్‌ 'కె2' ద్వారా సేకరించిన డేటాను పరిశీలించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ సదర్న్‌ క్వీన్స్‌ల్యాండ్‌కు చెందిన పరిశోధకురాలు డాక్టర్‌ చెల్సియా హువాంగ్‌ మాట్లాడుతూ, ఈ గ్రహం తన చుట్టూ ఒకసారి తిరగడానికి సుమారు 355 రోజులు పడుతుందని.. ఇది భూమి ఏడాదితో చాలా దగ్గరగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

వివరాలు 

సౌర కుటుంబానికి కేవలం 150 కాంతి సంవత్సరాల దూరంలో..

ఈ గ్రహం తన నక్షత్రం చుట్టూ ఉన్న 'హాబిటబుల్‌ జోన్‌'లో ఉండే అవకాశం దాదాపు 50 శాతం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. అంటే అక్కడ నీరు వంటి జీవానికి అవసరమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉందన్న మాట. "ఈ భూమి పరిమాణం ఉన్న గ్రహం మన సౌర కుటుంబానికి కేవలం 150 కాంతి సంవత్సరాల దూరంలో ఉండటం చాలా ఆసక్తికర విషయం," అని హువాంగ్‌ చెప్పారు. "ఇదివరకు గుర్తించిన ఇలాంటి గ్రహం కెప్లర్‌-186ఎఫ్‌ మనకు నాలుగు రెట్లు దూరంలో ఉండటంతో పాటు చాలా మసకగా ఉంటుంది," అని వివరించారు.

Advertisement

వివరాలు 

యూనివర్సిటీ ఆఫ్‌ సదర్న్‌ క్వీన్స్‌ల్యాండ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసిన వెన్నర్

HD 137010 b తన నక్షత్రం ముందుగా క్షణకాలం దాటినప్పుడు నక్షత్ర వెలుగులో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. ఆ స్వల్ప సంకేతం ఆధారంగానే ఈ గ్రహం ఉన్నట్లు గుర్తించారు. ఆసక్తికర విషయం ఏమిటంటే,ఈ సంకేతాన్ని తొలుత'ప్లానెట్‌ హంటర్స్‌'అనే సిటిజన్‌ సైన్స్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్న సాధారణ పరిశీలకుల బృందం గుర్తించింది. ఆ సమయంలో ఈ అధ్యయనానికి ప్రధాన రచయిత అయిన డాక్టర్‌ అలెగ్జాండర్‌ వెన్నర్‌ హైస్కూల్‌ విద్యార్థి కావడం విశేషం. "స్కూల్‌లో చదువుతున్నప్పుడు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యాను.అదే నాకు పరిశోధనలపై ఆసక్తి పెంచింది," అని వెన్నర్‌ తెలిపారు. అనంతరం ఆయన యూనివర్సిటీ ఆఫ్‌ సదర్న్‌ క్వీన్స్‌ల్యాండ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు.

Advertisement

వివరాలు 

గ్రహం నక్షత్రం ముందుగా దాటినప్పుడు కనిపించే సంకేతం 

"మళ్లీ ఈ డేటాను పరిశీలించి ఇంత కీలకమైన ఆవిష్కరణ చేయడం ఎంతో ఆనందంగా ఉంది,"అని ఆయన చెప్పారు మొదట ఈ గ్రహాన్నికనుగొనడంపై శాస్త్రవేత్తలకు కూడా అనుమానం వచ్చిందని హువాంగ్‌ తెలిపారు. "ఇది నిజం కావడం అసాధ్యం అనిపించింది. కానీ రెండుసార్లు, మూడుసార్లు అన్ని వివరాలు పరిశీలించాం. చివరికి ఇది ఒక గ్రహం నక్షత్రం ముందుగా దాటినప్పుడు కనిపించే సంకేతానికి పాఠ్యపుస్తక ఉదాహరణలా ఉందని నిర్ధారించాం," అని చెప్పారు.

వివరాలు 

నక్షత్రం సూర్యుడితో పోలిస్తే చల్లగా,మసకగా..

ఈ గ్రహం చుట్టూ తిరిగే నక్షత్రం ప్రకాశం ఎక్కువగా ఉండటం, మనకు దగ్గరగా ఉండటంతో భవిష్యత్తులో వచ్చే ఆధునిక టెలిస్కోప్‌లతో దీనిని పరిశీలించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. "కొత్త తరం టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన వెంటనే పరిశీలించబోయే తొలి లక్ష్యాల్లో ఇదొకటిగా ఉంటుంది,"అని హువాంగ్‌ చెప్పారు. అయితే ఈ నక్షత్రం మన సూర్యుడితో పోలిస్తే చల్లగా, మసకగా ఉండటంతో, ఆ గ్రహంపై ఉపరితల ఉష్ణోగ్రతలు మంగళగ్రహం మాదిరిగా ఉండే అవకాశముందని అంచనా.అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్‌ 70 డిగ్రీల సెల్సియస్‌ కన్నా తక్కువగా కూడా ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిశోధనలో భాగం కాని స్విన్‌బర్న్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్‌ సారా వెబ్‌ ఈ ఆవిష్కరణ చాలా ఉత్కంఠభరితమైనదని వ్యాఖ్యానించారు.

వివరాలు 

గెలాక్సీ పరంగా చూస్తే ఈ గ్రహం చాలా దగ్గరలోనే..

అయితే దీనిని పూర్తిస్థాయి బాహ్యగ్రహంగా నిర్ధారించడానికి ఇంకా మరిన్ని పరిశీలనలు అవసరమని తెలిపారు. "ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే సంకేతం కనిపించింది.సాధారణంగా మూడుసార్లు కనిపిస్తేనే ఖచ్చితంగా గ్రహమని చెబుతాం,"అని చెప్పారు. ఈ గ్రహం భూమిలాంటిదై ఉండే అవకాశం ఉన్నప్పటికీ,ఇది పూర్తిగా మంచుతో కప్పబడి ఉన్న 'సూపర్‌ స్నోబాల్‌'గ్రహం కూడా కావచ్చని వెబ్‌ అభిప్రాయపడ్డారు. అంటే భారీగా నీరు ఉండొచ్చు కానీ అది ఎక్కువ భాగం గడ్డకట్టిపోయి ఉండే అవకాశముందన్నారు. మన గెలాక్సీ పరంగా చూస్తే ఈ గ్రహం చాలా దగ్గరలోనే ఉన్నా,ప్రస్తుత మన ప్రయాణ వేగాలతో అక్కడికి చేరుకోవాలంటే పదివేల నుంచి లక్షల సంవత్సరాలు పడుతుందని వెబ్‌ తెలిపారు. ఈ పరిశోధన ఫలితాలు ఈ వారం'ఆస్ట్రోఫిజికల్‌ జర్నల్‌ లెటర్స్‌'అనే అంతర్జాతీయ శాస్త్రీయ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

Advertisement