LOADING...
X Block Accounts: అశ్లీల కంటెంట్‌పై చర్యలు.. 600 ఖాతాలను బ్లాక్‌ చేసిన ఎక్స్
అశ్లీల కంటెంట్‌పై చర్యలు.. 600 ఖాతాలను బ్లాక్‌ చేసిన ఎక్స్

X Block Accounts: అశ్లీల కంటెంట్‌పై చర్యలు.. 600 ఖాతాలను బ్లాక్‌ చేసిన ఎక్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 11, 2026
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

'ఎక్స్‌'కు చెందిన ఏఐ ప్లాట్‌ఫామ్‌ గ్రోక్‌ (Grok)ను ఉపయోగించి కొందరు అసభ్య, అశ్లీల, చట్టవిరుద్ధ కంటెంట్‌ను సృష్టిస్తున్నారన్న ఆరోపణలతో ఇటీవల తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి (Grok Obscene Images Row). ఈ కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో, ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని ఎక్స్‌ కీలక చర్యలు చేపట్టింది. కేంద్ర ఆదేశాల మేరకు 3,500 పోస్టులను బ్లాక్‌ చేయడంతో పాటు 600 ఖాతాలను పూర్తిగా డిలీట్‌ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తమ వేదికపై అసభ్యతకు ఏమాత్రం తావివ్వబోమని, ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటిస్తామని ఎక్స్‌ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

Details

 స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

ఎలాన్‌ మస్క్‌కు చెందిన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌కు అనుసంధానంగా ఉన్న గ్రోక్‌ సహాయంతో ఇటీవల కొందరు అసభ్యకర చిత్రాలను సృష్టించడం తీవ్ర వివాదానికి దారితీసింది. ముఖ్యంగా మహిళల ఫొటోలను అనుచితంగా మార్ఫింగ్‌ చేసి పోస్టు చేయడం దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలకు కారణమైంది. ఈ నేపథ్యంలో అలాంటి కంటెంట్‌ను వెంటనే తొలగించాలని భారత ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే అసభ్యకర, చట్టవిరుద్ధ కంటెంట్‌పై వచ్చే ఫిర్యాదుల విషయంలో ఆయా సామాజిక మాధ్యమ వేదికలకే పూర్తి బాధ్యత ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎక్స్‌ ఇప్పటికే గ్రోక్‌లోని ఇమేజ్‌ జనరేషన్‌ ఫీచర్‌పై పరిమితులు విధించింది.

Details

చట్టవిరుద్ధమైన కంటెంట్ పూర్తిగా తొలగింపు

ఆ ఫీచర్‌ను ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించింది. అంటే చెల్లింపు సభ్యులు మాత్రమే ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకుంది. అలాగే తమ వేదికపై పోస్టు అయ్యే ఏవైనా చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను పూర్తిగా తొలగించడంతో పాటు, వాటిని అప్‌లోడ్‌ చేసిన ఖాతాలను డిలీట్‌ చేస్తామని ఎక్స్‌ ప్రకటించింది. ఈ ప్రకటనలో భాగంగానే తాజాగా ఈ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.

Advertisement