Aditya-L1: ఇస్రో మరో ముందడుగు.. ఆదిత్య-ఎల్1 ప్రయోగం విజయవంతం
అంతరిక్ష ప్రయోగంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ముందడుగు వేసింది. సూర్యునిపై అధ్యయనం కోసం పంపిన ఇస్రో పంపిన ఆదిత్య-ఎల్1 విజయవంతమైంది. దీంతో ఇస్రో మరోసారి చరిత్ర సృష్టించింది. సూర్యునిపై అధ్యయనం కోసం భారతదేశపు తొలి పంపిన అంతరిక్ష నౌక 'ఆదిత్య-ఎల్1'ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని ఎల్1 కక్ష్యలో ఇస్రో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఆదిత్య-ఎల్1 మిషన్ గత ఏడాది సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి లాంచ్ వెహికల్ PSLV-C57తో ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ మిషన్‌ను ఇస్రో రూ.1,000 కోట్ల బడ్జెట్‌తో, 5 సంవత్సరాల వ్యవధితో చేప్టటింది.
అంతరిక్షంలోకి పంపిన పేలోడ్‌లు
ఆదిత్య-L1తో పాటు 7 పేలోడ్‌లను సూర్యుడి కక్ష్యలోకి ఇస్రో ప్రవేశపెట్టింది. ఇందులో 4 పేలోడ్‌లు సూర్యుడిని పర్యవేక్షించే క్రమంలో రిమోట్ సోలార్ సెన్సింగ్ కోసం పనిచేస్తాయి. 3 పేలోడ్‌లు ఇన్-సిటు ప్రయోగాల కోసం పని చేస్తాయి. ఈ పేలోడ్‌ల నుంచి పంపిన డేటా సూర్యుని రహస్యాలను అర్థం చేసుకోవడంతో పాటు నిజ సమయంలో సౌర కార్యకలాపాలను పర్యవేక్షించడానికి సహాయపడుతాయి. అలాగే, ఈ పేలోడ్‌ల ద్వారా కరోనల్ హీటింగ్, సూర్యుని ఉపరితలంపై పేలుళ్లు, సౌర గాలి గురించి అనేక కొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.