Aditya-L1 Mission: ఆదిత్య ఎల్-1 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభం
అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో సత్తా చాటుతోంది. చంద్రయాన్-3 విజయవంతం కావడంతో మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. సూర్యుని రహస్యాలను ఛేదించడమే లక్ష్యంగా ఆదిత్య-ఎల్1 ప్రయోగాన్ని చేపట్టనున్నారు. శనివారం ఉదయం 11.50 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరి కోటలోని షార్ కేంద్ర నుంచి దీన్ని ప్రయోగించనున్నారు. ఈ శాటిలైట్ సూర్యుడి వైపు దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఆదిత్య-ఎల్1 ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ నేడు ప్రారంభమైందని, ఈ ప్రయోగానికి సంబంధించిన రిహార్సల్ ఇప్పటికే పూర్తి చేశామని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ పేర్కొన్నారు.
ఏడు పెలోడ్స్ ను వెంట తీసుకెళ్లనున్న పీఎస్ఎల్వీ
పీఎస్ఎల్వీ సీ57 పనితీరు, ఇతర యంత్ర సామాగ్రి, డేటా కనెక్షన్స్, కంట్రోల్ రూమ్ తో లింకేజ్ వ్యవస్థ వంటి కీలక విభాగాలు సంతృప్తికరంగా ఉన్నట్లు వెల్లడించింది. మొత్తంగా ఏడు పేలోడ్స్ ను పీఎస్ఎల్వీ శాటిలైట్ తన వెంట మోసుకెళ్లనుంది. రిమోట్ సెన్సింగ్ పేలోడ్స్ కేటగిరీలో విజిబుల్ ఎమిషన్ లైన్ కొరొనోగ్రాఫ్, సోలార్ అల్ట్రావయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, సోలార్ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్ ఉంటాయి. సూర్యుడు-భూమి కక్ష్యలోని లగరేంజ్ పాయింట్ (L1) వద్ద స్పేస్‌క్రాఫ్ట్‌ను ఉంచనున్నారు. ఆ పాయింట్ భూమికి దాదాపు 1.5 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.