Accenture : ప్రమోషన్ కోసం AI తప్పనిసరి.. యాక్సెంచర్ గట్టి హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రవేశంతో టెక్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్పులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల భవిష్యత్తుపై అనిశ్చితిని పెంచుతున్నాయి. ఎప్పుడు ఉద్యోగాలు కోల్పోతామో అన్న భయం ఉద్యోగుల్లో పెరుగుతోంది. టెక్ కంపెనీలు కూడా ఉద్యోగులు తప్పనిసరిగా AIకి అలవాటు పడాలని స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల ప్రముఖ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ సుమారు 11,000 మంది ఉద్యోగులను తొలగించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ స్థాయి ఉద్యోగులు AI టూల్స్ వినియోగించకపోతే ప్రమోషన్లు ఉండవని తేల్చిచెప్పింది. అంతేకాదు AI వాడని వారి ఉద్యోగాలే ప్రమాదంలో పడే అవకాశముందని పరోక్షంగా హెచ్చరించింది. అసోసియేట్ డైరెక్టర్లు, సీనియర్ మేనేజర్లకు పంపిన ఇమెయిల్‌లో కంపెనీ స్పష్టం చేసింది.
Details
AI టూల్స్‌ను నిరంతరం ఉపయోగించడం తప్పనిసరి
లీడర్‌షిప్ రోల్స్‌కు ఎదగాలంటే AI టూల్స్‌ను నిరంతరం ఉపయోగించడం తప్పనిసరి అని పేర్కొంది. ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో కంపెనీ సీఈఓ జూలీ స్వీట్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంస్థలు తమ పనితీరును, ప్రాసెస్‌లను పూర్తిగా పునర్‌వ్యవస్థీకరించుకోవాలని, AI ఆధారంగా వర్క్‌ఫోర్స్‌ను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు ఇది ఒక్క యాక్సెంచర్ మాత్రమే తీసుకున్న నిర్ణయం కాదు. ఇతర టెక్ దిగ్గజాలు కూడా ఉద్యోగులకు గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. మైక్రో సాఫ్ట్ ఉద్యోగులకు AI వినియోగం ఒక ఆప్షన్ కాదని స్పష్టం చేసింది.
Details
ఉద్యోగ భద్రత కంటే నైపుణ్యాల నవీకరణే ప్రధానం
సంస్థ సీఈఓ సత్య నాదేళ్ల కూడా AIపై నమ్మకం లేకుంటే కంపెనీని వదిలేయాలనే స్థాయిలో కఠిన సందేశం ఇచ్చినట్లు సమాచారం. అదేవిధంగా మెటా తన ఉద్యోగుల AI వినియోగాన్ని ట్రాక్ చేస్తోంది. గూగుల్ కూడా AIను వినియోగించని వారు వెనకబడిపోతారని స్పష్టం చేస్తోంది. మొత్తానికి, AI యుగంలో ఉద్యోగ భద్రత కంటే నైపుణ్యాల నవీకరణే ప్రధానమని టెక్ కంపెనీలు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి.