
Google AI Mode: భారత వినియోగదారుల కోసం గూగుల్ ఏఐ సెర్చ్ మోడ్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తాజాగా భారతదేశానికి ప్రత్యేకంగా ఏఐ ఆధారిత సెర్చ్ మోడ్‌ను ప్రారంభించింది. ఈ విషయాన్ని స్వయంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఆన్‌లైన్ సెర్చ్ ప్రక్రియను పూర్తిగా కొత్త దిశలో తీసుకెళ్లే ఈ ఏఐ మోడ్ ప్రస్తుతం ట్రెడిషనల్ సెర్చ్‌తో అనుసంధానంగా పనిచేస్తోంది. సాధారణ సెర్చ్‌తో పోల్చితే ఇది వినియోగదారులకు మరింత విపులమైన,వివరమైన సమాధానాలను అందించగలదు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ ఫీచర్ అమెరికాలో తొలుత అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆ తర్వాత ప్రయోగాత్మకంగా జూన్‌లో భారతదేశంలో పరిచయం చేశారు. ఆ దశలో గూగుల్ ల్యాబ్స్ ద్వారా మాత్రమే దీనిని ఉపయోగించాల్సి వచ్చేది. వినియోగదారుల నుండి లభించిన అభిప్రాయాలు, ప్రయోగాత్మక అనుభవాల ఆధారంగా,ఇప్పుడు ఈ సేవను దేశవ్యాప్తంగా విస్తరించారు.
వివరాలు
ఏఐ సెర్చ్ మోడ్ ఎలా పనిచేస్తుంది?
ఇకపై ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే సెర్చ్ ల్యాబ్స్ ద్వారా ప్రత్యేకంగా సైన్ అప్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతానికి ఈ సేవలు కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త సెర్చ్ విధానం ద్వారా వినియోగదారులు సంక్లిష్టమైన ప్రశ్నలకూ స్పష్టమైన,సమగ్ర సమాధానాలను పొందవచ్చు. గతంలో ఇలాంటి ప్రశ్నలకు ఉప ప్రశ్నల రూపంలో అనేకసార్లు సెర్చ్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటి కష్టాలేమీ అవసరం లేదు. జెమినీ 2.5 వెర్షన్ ఆధారంగా పనిచేసే ఈ ఫీచర్ ప్రధానమైన ప్రశ్నను అనేక ఉప ప్రశ్నలుగా విడగొట్టి, వాటి గురించి వెబ్‌లో ఉన్న సమాచారం మొత్తం సేకరిస్తుంది.
వివరాలు
ఏఐ సెర్చ్ మోడ్ ఎలా పనిచేస్తుంది?
ఆ సమాచారం సారాన్ని ఒక్కటిగా సమీకరించి వినియోగదారులకు సమాధానం అందిస్తుంది. అంతేకాదు, మరింత సమాచారం కోసం సంబంధిత వెబ్‌లింక్‌లను కూడా అందుబాటులో ఉంచుతుంది. వస్తువుల మధ్య తేడాలను పోల్చడం, ప్రయాణ ప్రణాళికలను రూపొందించుకోవడం వంటి జటిలమైన అవసరాలకు కూడా ఈ ఏఐ మోడ్ ఎంతో ఉపయోగకరమని గూగుల్ పేర్కొంది.