Math Mystery: 87 ఏళ్ల గణిత సమస్యను ఛేదించిన ఏఐ.. నిపుణులకే షాక్
ఈ వార్తాకథనం ఏంటి
గణిత నిపుణులను 87 ఏళ్లుగా సవాలు చేస్తున్న సమస్యకు కృత్రిమ మేధస్సు (ఏఐ) పరిష్కారం చూపినట్లు వెల్లడైంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు లెవెంట్ అల్పోగే (Levent Alpoge) జాకోబియన్ కాన్జెక్చర్‌గా ప్రసిద్ధి చెందిన గణిత ఊహ నిజం కాదని ప్రకటించారు. ఇందుకు ఒక సరళమైన ప్రతివాద ఉదాహరణ (కౌంటర్ ఎగ్జాంపుల్)ను చూపిస్తూ తన వాదనను సమర్థించారు. దీంతో ఏఐ కీలక పాత్ర పోషించి పరిష్కరించిన అత్యంత క్లిష్టమైన గణిత సమస్యగా ఇది నిలిచిందని నిపుణులు భావిస్తున్నారు.
వివరాలు
18 గణిత సమస్యల జాబితాలో కూడా దీనికి స్థానం
జాకోబియన్ కాన్జెక్చర్‌ను 1939లో గణిత శాస్త్రవేత్త ఒట్టో-హెయిన్‌రిచ్ కెల్లర్ ప్రతిపాదించారు.
ఒక ప్రత్యేక రకమైన గణిత ఫంక్షన్‌కు విరుద్ధ దిశలో కూడా అదే లక్షణాలు వర్తిస్తాయనే భావనపై ఈ ఊహ ఆధారపడింది.
గణిత శాస్త్రవేత్త స్టీఫెన్ స్మేల్ 1998లో ప్రకటించిన 21వ శతాబ్దంలోని అత్యంత క్లిష్టమైన 18 గణిత సమస్యల జాబితాలో కూడా దీనికి స్థానం లభించింది.
ఎన్నో దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా గణిత నిపుణులు ప్రయత్నించినప్పటికీ దీనికి స్పష్టమైన పరిష్కారం లభించలేదు.
వివరాలు
ఏఐ అందించిన సహాయానికి అల్పోగే ప్రత్యేకంగా కృతజ్ఞతలు
ఈ విజయానికి తన "సన్నిహిత మిత్రుడు ఫేబుల్" సహకరించాడని అల్పోగే తెలిపారు.
ఇది ఆంత్రోపిక్ సంస్థ అభివృద్ధి చేసిన క్లాడ్ ఫేబుల్ 5 (Claude Fable 5) ఏఐ మోడల్‌ను సూచిస్తోందని భావిస్తున్నారు.
సమస్య పరిష్కారంలో ఏఐ అందించిన సహాయానికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఏఐను ఎలా ఉపయోగించారన్న పూర్తి వివరాలను వెల్లడించలేదు.
అయినప్పటికీ ఆయన చూపిన గణిత ఆధారాన్ని ఇతర గణిత శాస్త్రవేత్తలు వేగంగా పరిశీలించి సరైనదేనని నిర్ధారించినట్లు సమాచారం.
వివరాలు
పాత గణిత సమస్యను రిష్కరించిన ఓపెన్‌ఏఐ మోడల్
ఈ పరిణామంపై లండన్‌లోని క్వీన్ మేరీ విశ్వవిద్యాలయానికి చెందిన అభిషేక్ సాహా స్పందిస్తూ, ఇటీవల గణిత రంగంలో ఏఐ సాధిస్తున్న విజయాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని అన్నారు.
గతంలో పాల్ ఎర్డోష్ ప్రతిపాదించిన మరో పాత గణిత సమస్యను కూడా ఓపెన్‌ఏఐ మోడల్ పరిష్కరించిందని గుర్తు చేశారు.
అయితే జాకోబియన్ కాన్జెక్చర్ విషయంలో ఏఐ పోషించిన పాత్ర ఇప్పటివరకు గణిత చరిత్రలోనే అత్యంత కీలకమైనదిగా ఆయన అభిప్రాయపడ్డారు.
వివరాలు
ఇంకా కొన్ని ప్రశ్నలు మిగిలే ఉన్నాయి
అయితే ఈ అంశంలో ఇంకా కొన్ని ప్రశ్నలు మిగిలే ఉన్నాయి.
అల్పోగే చూపిన ప్రతివాద ఉదాహరణ మూడు వేరియబుల్స్‌కు మాత్రమే వర్తిస్తుండగా, రెండు వేరియబుల్స్‌కు సంబంధించిన రూపం మాత్రం ఇప్పటికీ సరైనదై ఉండే అవకాశం ఉందని గణిత శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ యార్క్‌కు చెందిన క్రిస్ బౌమన్-స్కార్గిల్ మాట్లాడుతూ, ఒక ఊహను తప్పని నిరూపించడం ఒక విషయం అయితే, పూర్తిగా కొత్త గణిత సిద్ధాంతాలను నిర్మించడం మాత్రం ఇప్పటికీ మానవ మేధస్సు, సృజనాత్మకతపైనే ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించారు.