Meta AI: మెటాలో ఏఐ కలకలం.. ఉద్యోగుల ఆగ్రహంతో దిగొచ్చిన జుకర్‌బర్గ్!
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రస్తుతం ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని శాసిస్తున్న అత్యంత ప్రభావవంతమైన శక్తిగా మారింది. ఈ ఏఐ పోటీలో ఇతర సంస్థల కంటే ముందంజలో ఉండాలనే లక్ష్యంతో సోషల్ మీడియా దిగ్గజం మెటా చేపట్టిన భారీ ప్రయోగం ఇప్పుడు అదే సంస్థలో తీవ్ర కలకలం రేపుతోంది. సిలికాన్ వ్యాలీ చరిత్రలో అరుదుగా కనిపించే స్థాయిలో ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో మెటా యాజమాన్యం వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా తాము పలు తప్పులు చేశామని మెటా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆండ్రూ బోస్వర్త్ స్వయంగా అంగీకరించారు. సంస్థలో జరిగిన పరిణామాలపై ఆయన ఉద్యోగులకు అంతర్గత మెమో విడుదల చేయడం ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.
వివరాలు
అసలు వివాదం ఎలా మొదలైంది?
ఈ ఏడాది మార్చిలో మెటా తన ఏఐ ప్రాజెక్టులను మరింత వేగవంతం చేయడానికి "అప్లైడ్ ఏఐ" పేరుతో కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసింది. సంస్థలోని పలు విభాగాల నుంచి సుమారు 6,500 మంది ఇంజనీర్లు, ప్రొడక్ట్ మేనేజర్లను ఒక్కసారిగా కొత్త టీమ్‌లోకి బదిలీ చేసింది. అయితే ఈమార్పులు ఉద్యోగుల అంగీకారం లేకుండా బలవంతంగా జరగడంతో అసంతృప్తి నెలకొంది. ముఖ్యంగా వారికి అప్పగించిన పనులు ఏఐ మోడళ్లకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన పజిల్స్, కోడింగ్ సమస్యలు రూపొందించడం వంటి రొటీన్ కార్యకలాపాలుగా ఉండటంతో ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ పరిస్థితిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కొందరు ఉద్యోగులు కొత్త విభాగాన్ని రష్యాలోని క్రూరమైన ఖైదీల శిబిరం "గులాగ్"తో పోల్చడం వరకు వెళ్లారు.
వివరాలు
ఉద్యోగులకు క్షమాపణలు చెప్పిన సీటీఓ
ఈ వివాదంపై స్పందించిన ఆండ్రూ బోస్వర్త్ ఉద్యోగులకు పంపిన లేఖలో, "కంపెనీ భవిష్యత్తు లక్ష్యాలను మీకు సరిగా వివరించడంలో, ఈ మార్పులు మీ కెరీర్‌కు ఎలా ఉపయోగపడతాయో చెప్పడంలో మేము తీవ్రంగా విఫలమయ్యాంటూ బహిరంగంగా క్షమాపణలు కోరారు. ఇదే అంశంపై కొద్ది రోజుల ముందే మార్క్ జుకర్‌బర్గ్ కూడా ఉద్యోగులకు మెమో విడుదల చేశారు. సంస్థలో చేపట్టిన మార్పులు చాలా సంక్లిష్టంగా ఉండటంతో తాము కొన్ని తప్పిదాలు చేశామని ఆయన అంగీకరించారు.
వివరాలు
భారీ స్థాయిలో ఉద్యోగుల మార్పులు, తొలగింపులు
మెటాలో గందరగోళం ఇక్కడితో ఆగలేదు. గడిచిన మే నెలలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 8,000 మంది ఉద్యోగులను తొలగించిన సంస్థ, మరో 7,000 మందిని ఏఐ ఆధారిత బృందాల్లోకి బదిలీ చేసింది. దీనికి తోడు ఉద్యోగుల కంప్యూటర్లలో మౌస్ కదలికలను పర్యవేక్షించే "మౌస్ ట్రాకింగ్" ప్రోగ్రామ్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ చర్య ఉద్యోగుల మనోధైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో చివరకు ఆ నిఘా వ్యవస్థను మెటా ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.
వివరాలు
భవిష్యత్తులో మార్పులు
ఇలాంటి పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని మెటా హామీ ఇచ్చింది. ఇకపై ఒక మేనేజర్ ఆధ్వర్యంలో గరిష్టంగా 20 మంది ఉద్యోగులు మాత్రమే ఉండేలా పరిమితి విధించాలని నిర్ణయించింది. అదే సమయంలో ఏఐ కారణంగా ఉద్యోగాలు కోల్పోతామనే భయాలపై స్పందించిన ఆండ్రూ బోస్వర్త్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఏఐ మీ ఉద్యోగాన్ని తీసుకోదు. కానీ ఏఐ టెక్నాలజీపై అవగాహన ఉన్న మరొక వ్యక్తి మీ ఉద్యోగాన్ని తీసుకునే అవకాశం ఉంది. అందుకే కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడం చాలా అవసరమని హెచ్చరించారు. టెక్నాలజీ రంగంలో ఎంతటి పురోగతి సాధించినా, సంస్థ విజయానికి ఉద్యోగుల విశ్వాసం కీలకమని, ఆ నమ్మకాన్ని కోల్పోతే విజయాన్ని నిలబెట్టుకోవడం కష్టమనే విషయాన్ని మెటా తాజా పరిస్థితులు స్పష్టంగా చాటుతున్నాయి.