LOADING...
Mummy: 5,300 ఏళ్ల ఓట్జీ మమ్మీలో ఇంకా సజీవంగా ఉన్న సూక్ష్మజీవులు.. శాస్త్రవేత్తల సంచలన ఆవిష్కరణ
శాస్త్రవేత్తల సంచలన ఆవిష్కరణ

Mummy: 5,300 ఏళ్ల ఓట్జీ మమ్మీలో ఇంకా సజీవంగా ఉన్న సూక్ష్మజీవులు.. శాస్త్రవేత్తల సంచలన ఆవిష్కరణ

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 03, 2026
09:07 am

ఈ వార్తాకథనం ఏంటి

సుమారు 5,300 ఏళ్ల క్రితం ఇటాలియన్ ఆల్ప్స్ పర్వతాల్లో బాణం దాడికి గురై మరణించిన 'ఓట్జీ ఐస్‌మ్యాన్' గురించి శాస్త్రవేత్తలు మరో ఆసక్తికర విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. వేల ఏళ్లుగా మంచులో భద్రంగా ఉన్న అతని శరీరం నిర్జీవంగా ఉన్నప్పటికీ, అందులోని సూక్ష్మజీవుల ప్రపంచం మాత్రం ఇప్పటికీ చురుగ్గా పనిచేస్తోందని తాజా పరిశోధన వెల్లడించింది. యూరప్‌లో అత్యంత ప్రసిద్ధ మమ్మీలలో ఒకటైన ఓట్జీ శరీరంలో ప్రాచీన బ్యాక్టీరియా, చలిని తట్టుకునే ఈస్ట్ జాతులు ఇప్పటికీ జీవక్రియలను కొనసాగిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఓట్జీ శరీరం మరింత దెబ్బతినకుండా ఉండేందుకు దాన్ని మైనస్ 6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ప్రత్యేక గదిలో భద్రపరిచారు.

వివరాలు 

కడుపులో దాగిన వేల ఏళ్ల చరిత్ర

ఈ ఏర్పాట్ల ప్రధాన ఉద్దేశం కాల ప్రభావాన్ని పూర్తిగా నిలిపివేయడమే. అయితే 'మైక్రోబయోమ్' అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం, ఓట్జీ శరీరంలోని సూక్ష్మజీవులు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చెందుతూ, ఇప్పటికీ పరిణామ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. ఇటలీలోని యూరాక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రధాన పరిశోధకుడు మహమ్మద్ సర్హాన్ నేతృత్వంలోని బృందం, ఓట్జీ చర్మం, అంతర్గత కణజాలాలు, కరిగిన మంచు నీటి నమూనాలను పరిశీలించింది. ఈ విశ్లేషణ ద్వారా వేల ఏళ్లుగా దాగి ఉన్న సూక్ష్మజీవుల జీవావరణ వ్యవస్థపై విలువైన సమాచారం బయటపడింది.

వివరాలు 

చివరి భోజనం ఆనవాళ్లు:

పరిశోధనలో ఓట్జీ మరణానికి ముందు అధిక కొవ్వు ఉన్న అడవి జంతువుల మాంసం, ప్రాచీన ధాన్యాలు, విషపూరిత ఫెర్న్ మొక్కను ఆహారంగా తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అతని కడుపులోని కొన్ని బ్యాక్టీరియా ఇప్పటికీ ఆ ఆహార అవశేషాలను జీర్ణం చేసే ప్రక్రియలో పాల్గొంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కనుమరుగైన బ్యాక్టీరియా: ఓట్జీ శరీరంలో 'రోంబౌట్సియా హోమినిస్', 'క్లోస్ట్రిడియం మోనిలిఫార్మ్' వంటి అరుదైన బ్యాక్టీరియా జాతులు గుర్తించారు. ఇవి ప్రస్తుతం ఆధునిక పట్టణ ప్రాంతాల ప్రజల్లో దాదాపు కనుమరుగైపోయాయి. ప్రస్తుతం ఈ బ్యాక్టీరియా కొన్ని ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని మారుమూల గిరిజన సమాజాల్లో మాత్రమే కనిపిస్తున్నాయని పరిశోధకులు వెల్లడించారు.

Advertisement

వివరాలు 

రసాయనాలనే తినేస్తున్న ఈస్ట్:

ఈ అధ్యయనంలో అత్యంత ఆశ్చర్యకర అంశం కొన్ని ఈస్ట్ జాతుల ప్రవర్తనే. ఓట్జీ శరీరంలో ఉన్న ఈ సూక్ష్మజీవులు గత తొమ్మిదేళ్లుగా వృద్ధి చెందుతున్నట్లు గుర్తించారు. మమ్మీని సంరక్షించడానికి మ్యూజియం సిబ్బంది ఉపయోగించే ఫినాల్ ఆధారిత క్రిమిసంహారక రసాయనాలను కూడా ఇవి ఆహారంగా ఉపయోగించుకోవడం నేర్చుకున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

Advertisement

వివరాలు 

మ్యూజియంల పరిరక్షణకు సవాల్?

ఓట్జీ మరణించినా, అతని శరీరంలోని సూక్ష్మజీవుల కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోలేదని ఈ పరిశోధన స్పష్టం చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పురాతన అవశేషాల పరిరక్షణపై కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గడ్డకట్టే ఉష్ణోగ్రతల్లోనూ జీవించగలిగే,ఆధునిక రసాయనాలను కూడా జీర్ణం చేసుకునే ఈ సూక్ష్మజీవులు భవిష్యత్తులో చారిత్రక సంపదకు ముప్పుగా మారే అవకాశం ఉందా అనే అంశంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాగి యుగానికి చెందిన ఈ వేటగాడిని ఎవరు హత్య చేశారనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లభించలేదు. అయితే అతని శరీరంలో ఇప్పటికీ కొనసాగుతున్న ఈ సూక్ష్మజీవుల కార్యకలాపాలు మానవ ఆరోగ్యం, ప్రాచీన జీవన విధానాలు, ఆధునిక వ్యాధుల పరిణామ క్రమం వంటి అనేక అంశాలపై కొత్త అవగాహనను అందించే అవకాశముందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Advertisement