US Homeland Security Network: అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ నెట్‌వర్క్‌పై భారీ సైబర్ దాడి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా ప్రభుత్వాన్ని మరోసారి భారీ సైబర్ దాడి కలవరపెడుతోంది. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS)కు చెందిన హోంల్యాండ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్ (HSIN)పై జరిగిన సైబర్ దాడిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు, అలాగే చట్ట అమలు సంస్థలు పరస్పరం గూఢచారి సమాచారం, భద్రతా వివరాలను పంచుకునేందుకు ఈ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తుంటాయి. నెక్స్ట్‌గవ్ నివేదిక ప్రకారం,మే చివరి వారంలో నుంచి జూన్ ప్రారంభం మధ్య హ్యాకర్లు HSIN సర్వర్లలోకి చొరబడినట్లు గుర్తించారు. ఈ సమయంలో నెట్‌వర్క్‌లో భాగస్వామ్యం చేసిన సమాచారం కొంత మేరకు హ్యాకర్ల చేతికి వెళ్లి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
వివరాలు
అమెరికా ప్రభుత్వ సైబర్ భద్రతా వ్యవస్థల సామర్థ్యంపై మరోసారి ప్రశ్నలు
ఈ ఘటనను ధృవీకరించిన DHS ప్రతినిధి,వర్గీకరించని పాత సమాచార భాగస్వామ్య వ్యవస్థలో ఇటీవల సైబర్ ఘటన జరిగిన విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అయితే ఏ సమాచారం చోరీకి గురైంది,ఎంత మేరకు డేటా బయటకు వెళ్లిందనే విషయాలపై ఇంకా స్పష్టత లేదన్నారు. ఈఅంశంపై టెక్‌క్రంచ్ వేసిన ప్రశ్నలకు కూడా అధికారులు స్పందించలేదు. ఈసైబర్ దాడి అమెరికా ప్రభుత్వ సైబర్ భద్రతా వ్యవస్థల సామర్థ్యంపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. వర్జీనియా రాష్ట్రానికి చెందిన డెమొక్రాటిక్ సెనేటర్,సెనేట్ ఇంటెలిజెన్స్ కమిటీ సీనియర్ సభ్యుడు మార్క్ వార్నర్ మాట్లాడుతూ,HSINలోని సమాచారం రహస్య పత్రాల కిందికి రాకపోయినా అత్యంత సున్నితమైనదని పేర్కొన్నారు. ఈ సమాచారం బయటకు వెళ్లడం జాతీయ భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.
వివరాలు
వరల్డ్ కప్ మ్యాచ్‌ల భద్రతా సమన్వయానికి కూడా HSIN కీలకం
అమెరికాలో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్‌ల భద్రతా సమన్వయానికి కూడా HSIN కీలకంగా ఉపయోగపడుతోందని వార్నర్ వెల్లడించారు. గత ఏడాది వాషింగ్టన్ డీసీ సమీపంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రయాణికుల విమానం, అమెరికా ఆర్మీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ గాల్లో ఢీకొన్న ఘటనలో 67 మంది మరణించిన సమయంలో సహాయక చర్యల సమన్వయానికి కూడా ఇదే వేదికను వినియోగించినట్లు తెలిపారు.
వివరాలు
గత ఏడాదిగా అమెరికా ఫెడరల్ ప్రభుత్వంపై వరుసగా సైబర్ భద్రతా లోపాలు వెలుగుచూస్తున్నాయి
ఈ దాడికి పాల్పడిన హ్యాకర్లు ఎవరు, వారు ఏ సంస్థకు చెందినవారు, వారి లక్ష్యం ఏమిటన్నది ఇప్పటికీ తెలియరాలేదు. గత ఏడాదిగా అమెరికా ఫెడరల్ ప్రభుత్వంపై వరుసగా సైబర్ భద్రతా లోపాలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో ఈ ఘటన కూడా అదే పరంపరలో మరో ముఖ్యమైన పరిణామంగా భావిస్తున్నారు. 2025 జనవరిలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత అనుమతి లేని యాప్‌ల ద్వారా రహస్య సమాచార మార్పిడి, ప్రభుత్వ డేటాబేస్‌లకు అనధికార ప్రాప్యత వంటి పలు సైబర్ భద్రతా ఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.