DRDO: దేశ రక్షణలో మరో మైలురాయి.. బాలిస్టిక్ క్షిపణులకు భారత్ చెక్‌మేట్!
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రక్షణ రంగంలో భారత్ మరో కీలక మైలురాయిని అధిగమించింది. శత్రుదేశాల నుంచి ఎదురయ్యే అధునాతన ముప్పులను సమర్థంగా ఎదుర్కొనే దిశగా రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకుంది. బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ (BMD), యాంటీ-షిప్ వార్‌ఫేర్ రంగాల్లో అత్యాధునిక సాంకేతికతలను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) విజయవంతంగా పరీక్షించింది. దీంతో దీర్ఘశ్రేణి బాలిస్టిక్, ఖండాంతర క్షిపణుల దాడులను తిప్పికొట్టే సామర్థ్యం భారత్‌కు లభించినట్లయిందని అధికారులు పేర్కొన్నారు.
వివరాలు
అత్యాధునిక సాంకేతికతకు రూపకల్పన
ఈ విషయాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎక్స్ వేదికగా వెల్లడిస్తూ, పరీక్షలకు సంబంధించిన ఫొటోలను కూడా పంచుకున్నారు. డీఆర్డీవో అభివృద్ధి చేసిన మల్టీ-లేయర్డ్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ (Multi-layered BMD) వ్యవస్థను ఇటీవల విజయవంతంగా పరీక్షించారు. దీర్ఘశ్రేణి ఖండాంతర క్షిపణుల ముప్పును సమర్థంగా ఎదుర్కొనేలా ఈ రక్షణ వ్యవస్థను అత్యాధునిక సాంకేతికతతో రూపొందించారు. జూన్ 10, 11 తేదీల్లో వరుసగా మూడు ఫ్లైట్ టెస్ట్‌లు నిర్వహించగా, ఇందులో ఉపయోగించిన ఇంటర్‌సెప్టర్ క్షిపణులు తమ లక్ష్యాలను విజయవంతంగా ఛేదించాయి. దీంతో ఈ వ్యవస్థ సామర్థ్యం మరోసారి రుజువైందని డీఆర్డీవో వెల్లడించింది.
వివరాలు
తొలి పరీక్షను విజయవంతంగా నిర్వహించిన శస్త్రవేత్తలు
ఈ విజయంతో బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సామర్థ్యం కలిగిన దేశాల జాబితాలో భారత్ అధికారికంగా చేరినట్లయిందని డీఆర్డీవో పేర్కొంది. అదేవిధంగా నావల్ యాంటీ-షిప్ మిసైల్ మీడియం రేంజ్ (NASM-MR) తొలి పరీక్షను కూడా శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించారు. ఈ రెండు కీలక విజయాల నేపథ్యంలో డీఆర్డీవో శాస్త్రవేత్తలు, బృందాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.