LOADING...
Anthropic: ఓపెన్‌ఏఐని అధిగమించి.. ట్రిలియన్‌ డాలర్ల విలువకు చేరువలో ఆంత్రోపిక్‌..!
ఓపెన్‌ఏఐని అధిగమించి.. ట్రిలియన్‌ డాలర్ల విలువకు చేరువలో ఆంత్రోపిక్‌..!

Anthropic: ఓపెన్‌ఏఐని అధిగమించి.. ట్రిలియన్‌ డాలర్ల విలువకు చేరువలో ఆంత్రోపిక్‌..!

వ్రాసిన వారు Sirish Praharaju
May 29, 2026
11:45 am

ఈ వార్తాకథనం ఏంటి

కృత్రిమ మేధ రంగంలో పోటీ రోజురోజుకూ ఉత్కంఠభరితంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ కృత్రిమ మేధ సంస్థ ఆంత్రోపిక్‌ మార్కెట్‌ విలువ ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి చేరువైంది. తాజాగా చేపట్టిన 65 బిలియన్‌ డాలర్ల నిధుల సమీకరణ సందర్భంగా సంస్థ విలువను పెట్టుబడిదారులు 965 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు. ఈ నిధుల సమీకరణ వివరాలను సంస్థ గురువారం వెల్లడించింది. ఈ పెట్టుబడి దశలో ఆల్టిమీటర్‌ క్యాపిటల్‌, డ్రాగోనీర్‌, గ్రీనోక్స్‌, సెక్వోయా క్యాపిటల్‌ వంటి ప్రముఖ పెట్టుబడి సంస్థలు భాగస్వామ్యమయ్యాయి. వీటిలో ప్రతి సంస్థ సుమారు రెండు బిలియన్‌ డాలర్ల మేర ఆంథ్రోపిక్‌లో పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై సెక్వోయా క్యాపిటల్‌ అధికారికంగా స్పందించలేదు.

వివరాలు 

గూగుల్‌, అమెజాన్‌తో పాటు ప్రముఖ సంస్థల మద్దతు

ఆంథ్రోపిక్‌కు గూగుల్‌ నుంచి మరోసారి భారీ స్థాయిలో మద్దతు లభించింది. ఇప్పటికే ఈ సంస్థలో 40 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్‌ ప్రకటించింది. అలాగే అమెజాన్‌ కూడా ఐదు బిలియన్‌ డాలర్ల వరకు నిధులు సమకూర్చినట్లు తెలుస్తోంది. శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌, మైక్రాన్‌ టెక్నాలజీ, ఎస్‌కే హైనిక్స్‌ వంటి ప్రముఖ సాంకేతిక సంస్థలు కూడా పెట్టుబడిదారుల జాబితాలో ఉన్నాయి. కృత్రిమ మేధతో అనుబంధం ఉన్న సంస్థల విలువలు ఇటీవల కాలంలో గణనీయంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆధునిక చిప్‌ల తయారీ రంగంలో ఉన్న శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌, మైక్రాన్‌ టెక్నాలజీ, ఎస్‌కే హైనిక్స్‌ వంటి సంస్థలు ఇటీవల ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువను అందుకోవడం విశేషం.

వివరాలు 

త్వరలో మిథోస్‌ శ్రేణి కృత్రిమ మేధ వ్యవస్థ

ఇక ఉత్పత్తుల విస్తరణలోనూ ఆంథ్రోపిక్‌ దూకుడు కొనసాగిస్తోంది. ఇటీవల క్లాడ్‌ ఓపస్‌ 4.8 నమూనాను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థ, మరికొన్ని వారాల్లో మిథోస్‌ శ్రేణి కృత్రిమ మేధ వ్యవస్థను కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇంకా వెల్లడించలేదు. మిథోస్‌కు అత్యాధునిక సైబర్‌ భద్రతా సామర్థ్యాలు ఉన్నట్లు సమాచారం. వివిధ సాఫ్ట్‌వేర్‌లలో ఎన్నో ఏళ్లుగా గుర్తించని లోపాలను వేగంగా గుర్తించడంతో పాటు, వాటిని ఎలా వినియోగించవచ్చో కూడా సూచించే సామర్థ్యం దీనికి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అమెరికాలోని ప్రముఖ సాంకేతిక సంస్థలు తమ సాఫ్ట్‌వేర్‌ భద్రతపై మరింత అప్రమత్తమయ్యాయి.

Advertisement

వివరాలు 

ప్రభుత్వ ఆందోళనలతో వాయిదా

మిథోస్‌ సామర్థ్యాలపై వ్యక్తమైన ఆందోళనల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వ సూచనల మేరకు దాని విడుదలను ఆంథ్రోపిక్‌ కొంతకాలం వాయిదా వేసినట్లు సమాచారం. ఇదే సమయంలో 'ప్రాజెక్ట్‌ గ్లాస్‌వింగ్‌' పేరుతో మిథోస్‌ సాంకేతికతను ఉపయోగించి ప్రముఖ సాంకేతిక సంస్థల సాఫ్ట్‌వేర్‌లలోని లోపాలను గుర్తించి సరిచేసే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీంతో కృత్రిమ మేధ రంగంలో ఆంథ్రోపిక్‌ ప్రభావం మరింత పెరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement