Loading...
Apple: కస్టమర్ సేవల కోసం లైవ్ నోట్స్‌ను పరీక్షిస్తున్న ఆపిల్
కస్టమర్ సేవల కోసం లైవ్ నోట్స్‌ను పరీక్షిస్తున్న ఆపిల్

Apple: కస్టమర్ సేవల కోసం లైవ్ నోట్స్‌ను పరీక్షిస్తున్న ఆపిల్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 20, 2026
01:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆపిల్ తన ఎంపిక చేసిన కొన్ని రిటైల్ స్టోర్లలో 'లైవ్ నోట్స్' పేరుతో కొత్త కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థను పరీక్షిస్తున్నట్లు సమాచారం. ఈ టెక్నాలజీ ద్వారా జీనియస్ బార్‌లో (ఆపిల్ స్టోర్లలో టెక్నికల్ సపోర్ట్, రిపేర్ సేవలు అందించే విభాగం) కస్టమర్లతో జరిగే సంభాషణలను రికార్డ్ చేసి, వాటిని టెక్స్ట్ రూపంలోకి మార్చి సంస్థ అంతర్గత వ్యవస్థలో భద్రపరుస్తుంది. ఈ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం ఉద్యోగులు కస్టమర్లతో మాట్లాడుతున్న సమయంలో నోట్స్ రాసుకోవడంపై సమయం వెచ్చించకుండా, సేవల నాణ్యతపై పూర్తిగా దృష్టి పెట్టేలా చేయడమే. అయితే ఏ సంభాషణను రికార్డ్ చేయాలన్నా ఉద్యోగి, కస్టమర్ ఇద్దరి స్పష్టమైన అంగీకారం తప్పనిసరిగా ఉండాలని ఆపిల్ పేర్కొంది.

వివరాలు 

స్టోర్ మేనేజర్లకు ట్రాన్స్‌క్రిప్ట్‌లు అందుబాటులో ఉండవు: ఆపిల్ 

ఉద్యోగుల గోప్యతకు సంబంధించిన ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని ఈ విధానంలో కొన్ని భద్రతా చర్యలను కూడా తీసుకుంది.

సంభాషణల ఆడియో ఫైళ్లను భద్రపరచబోమని,స్టోర్ మేనేజర్లకు ట్రాన్స్‌క్రిప్ట్‌లు అందుబాటులో ఉండవని కంపెనీ స్పష్టం చేసింది.

అలాగే ట్రాన్స్‌క్రిప్ట్, దాని సారాంశాన్ని ఉద్యోగులు అవసరమైతే సవరించిన తర్వాతే అంతర్గత వ్యవస్థలో సేవ్ చేసే అవకాశం కల్పించింది.

వివరాలు 

ఉద్యోగులు, కస్టమర్లపై బలవంతం ఉండదు: ఆపిల్  

అయితే ఈ విధానం భవిష్యత్తులో ఉద్యోగుల పనితీరును అంచనా వేయడానికి లేదా వారికి శిక్షణ ఇచ్చే సందర్భాల్లో ఉపయోగించే అవకాశం ఉందనే అనుమానాలు కొందరు ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి.

దీనిపై స్పందించిన ఆపిల్, ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, కస్టమర్లు పాల్గొనడం పూర్తిగా స్వచ్ఛందమని, ఎవరిపైనా బలవంతం ఉండదని మరోసారి స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఈ లైవ్ నోట్స్ వ్యవస్థను అన్ని స్టోర్లకు విస్తరిస్తారా లేదా అనే విషయంపై మాత్రం సంస్థ ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.

ADVERTISEMENT