భారతదేశంలో త్వరలో రిటైల్ స్టోర్లను తెరవనున్న ఆపిల్ సంస్థ
భారతదేశంలో Apple ఫిజికల్ రిటైల్ దుకాణాలు గురించి కంపెనీ ఇంకా అధికారికంగా ఏమీ ప్రకటించలేదు, కానీ ఇప్పటికే వివిధ ఉద్యోగాల కోసం నియామకం ప్రారంభించింది. కొంతమంది లింక్డ్‌ఇన్‌లో తమ నియామకాన్ని అధికారికంగా ధృవీకరించారు. ఆపిల్ ఉత్పత్తులకు భారతదేశంలో ప్రాముఖ్యత పెరుగుతోంది. చైనాలో ఎదుర్కొంటున్న సమస్యలతో తయారీ కేంద్రంగా భారతదేశాన్ని ఎంచుకునే ప్రయత్నాల్లో ఉంది. రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేయడం వలన ఆపిల్ తన అమ్మకాలను మరింత మెరుగుపరచుకోవచ్చు. భారతదేశపు భారీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి ఆపిల్ కు ఇది అవకాశం. ఆపిల్ కెరీర్ పేజీ (jobs.apple.com)లో "Apple retail" అనే విభాగంలో 12 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. స్టోర్ లీడర్, ఆపరేషన్స్ ఎక్స్‌పర్ట్, జీనియస్, బిజినెస్ ప్రో వంటి స్థానాలు ఉన్నాయి.
భారతదేశంలో మొట్టమొదటి ఆపిల్ రిటైల్ స్టోర్ ముంబైలో ఉంటుంది
రాబోయే రోజుల్లో కంపెనీ రిటైల్ విభాగంలో మరిన్ని ఉద్యోగావకాశాలు కనిపించవచ్చు. అయితే దేశంలో ఎన్ని స్టోర్‌లను తెరుస్తోంది అనే దాని గురించి ఇంకా సృష్టత లేదు. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో భారతదేశంలో తన రిటైల్ స్టోర్లను ప్రారంభించాలని ఆపిల్ లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త జాబ్ లిస్టింగ్‌లు దానికి అనుగుణంగానే ఉన్నాయి. న్యూయార్క్, బీజింగ్, మిలన్, సింగపూర్, లాస్ ఏంజెల్స్‌లోని ఆపిల్ అవుట్‌లెట్‌ల తరహా ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్‌లో 22,000 చదరపు అడుగుల స్టోర్ ఏర్పాటు చేస్తున్నారు . ఆపిల్ 2021లోనే దేశంలో తన మొదటి రిటైల్ స్టోర్‌ని ప్రారంభించాలని ప్లాన్ చేసింది. అయితే, COVID-19 మహమ్మారి కారణంగా ఇది ఆలస్యమైంది.