తవ్వకాల్లో బయటపడ్డ ఎలుగుబంటి ఎముకతో తయారు చేసిన సంగీత సాధనం
ఎలుగు బంటి ఎముకతో తయారు చేసిన పురాతన సంగీత సాధనాన్ని(ఫ్లూట్) పురావస్తు శాస్త్రవేతలు కనుక్కున్నారు. ఈ సంగీత సాధనం, ఇప్పటికీ పనిచేయడం విశేషం. స్లోవేనియా దేశంలో దివిజి నేన్ అనే గుహలో నియాండెర్తల్ ఫ్లూటును కనుగొన్నారు. ఆదిమానవుల జాతిలో ఒకరమైన నియాండెర్తల్స్, ఎలుగుబంటి తొడ ఎముకతో ఈ ఫ్లూటును తయారు చేసి ఉంటారని నమ్మకం. 1995లో ఇద్రికా నది పక్కనున్న గుహలో తవ్వకాలు జరిపిన శాస్త్రవేత్తలకు ఈ ఫ్లూటు దొరికింది. ఇవాన్ టర్క్ నేతృత్వంలో ఈ తవ్వకాలు జరిగాయి. పెద్ద ఎముకకు చిన్న రంధ్రాలున్న సాధనం దొరకడంతో, అది సంగీత సాధనమని నిర్ధారణకు వచ్చారు.
ఇప్పటికీ పనిచేస్తున్న ఫ్లూటు
ఎముకతో తయారైన ఈ ఫ్లూటులోని కొంత భాగం పాడైపోయింది. అయితే కొన్ని సంవత్సరాల క్రితం, ఈ ఫ్లూటుకు మరమ్మత్తులు చేసారు. ఈ మరమ్మతులను స్లోవేనియా మ్యూజియం నిర్వహించింది. సంగీత కారుల నేతృత్వంలో జరిగిన ఈ మరమ్మతులు విజయవంతం అయ్యాయి. ప్రస్తుతం ఈ ఫ్లూటుతో రాగాలను ఆలపిస్తున్నారు. స్లోవేనియాకు చెందిన సంగీత కారుడు జుబెన్ డింకరోస్కి, ఈ ఫ్లూటుతో సంగీతాన్ని సృష్టించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది. 50వేల సంవత్సరాల క్రితం నాటి సంగీత సాధనం, ఇప్పటికీ పనిచేయడం అద్భుతమని పురావస్తు శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫ్లూటు, స్లోవేనియా దేశపు మ్యూజియంలోనే ఉంది.