Asteroid 2023 WH: భూమికి దగ్గరగా గ్రహశకలం.. నాసా హెచ్చరిక
భూ గ్రహం వైపు ఆస్టరాయిడ్ 2023 డబ్ల్యూహెచ్ (Asteroid 2023 WH) అనే పెద్ద గ్రహశకలం దూసుకొస్తున్నట్లు అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) హెచ్చరికలు జారీ చేసింది. గ్రహశకలం 2023 డబ్ల్యూహెచ్ ప్రస్తుతం భూమి వైపు గంటకు 32,150 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్నట్లు NASA జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (JPL) వెల్లడించింది. ఈ గ్రహశకలం డిసెంబర్ 10 నాటికి దాదాపు భూమికి భూమికి అతి దగ్గరగా వెళుతుందని నాసా పేర్కొంది. ఆస్టరాయిడ్ 2023 డబ్ల్యూహెచ్ అపోలో గ్రహశకలాల సమూహానికి చెందినదిగా నాసా వెల్లడించింది. ఇది సుమారు సుమారు 213 అడుగుల వెడల్పుతో విమానం ఆకారంలో ఉంటుంది.
భూమికి ముప్పు ఏమీ లేదు
ఆస్టరాయిడ్ 2023 డబ్ల్యూహెచ్ గ్రహశకలం పరిమాణంలో పెద్దది అయినప్పటికీ.. దీని వల్ల భూమికి పెద్ద ముప్పు ఉండదని నాసా పేర్కొంది. ఇది భూమికి 45లక్షల కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తుందని చెప్పింది. సాధారణంగా ఒక గ్రహశకలం ఆస్టరాయిడ్ బెల్ట్ నుండి వైదొలిగి భూమికి 80లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు నాసా హెచ్చరిక జారీ చేస్తుంది. గ్రహశకలాలను అధ్యయనం చేయడం ద్వారా.. శాస్త్రవేత్తలు గ్రహాలు, సౌర వ్యవస్థ ఏర్పడే సమయంలో ఉన్న పరిస్థితుల గురించిన సమాచారాన్ని సేకరిస్తారు. నాసా అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఇప్పటివరకు 13 లక్షలకు పైగా గ్రహశకలాలు కనుగొనబడ్డాయి. వాటిలో కొన్ని క్రికెట్ మైదానం అంత పెద్దవి ఉన్నాయి. ఆస్టరాయిడ్ బెల్ట్‌లో కనిపించే చాలా గ్రహశకలాలు ఇనుము, నికెల్ వంటి లోహాలతో ఏర్పడుతాయి.