Loading...
Astronomers: అంతరిక్షంలో మరో వింత.. 'బ్లాక్‌హోల్‌ నక్షత్రం'ను గుర్తించిన ఖగోళ శాస్త్రవేత్తలు
అంతరిక్షంలో మరో వింత.. 'బ్లాక్‌హోల్‌ నక్షత్రం'ను గుర్తించిన ఖగోళ శాస్త్రవేత్తలు

Astronomers: అంతరిక్షంలో మరో వింత.. 'బ్లాక్‌హోల్‌ నక్షత్రం'ను గుర్తించిన ఖగోళ శాస్త్రవేత్తలు

వ్రాసిన వారు Moogati Shabari
Aug 13, 2026
05:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఖగోళ శాస్త్రవేత్తలు అంతరిక్షంలో ఇంతకుముందెన్నడూ చూడని ఓ కొత్త తరహా ఖగోళ వస్తువును గుర్తించినట్లు చెబుతున్నారు. దీనికి 'బ్లాక్‌హోల్‌ స్టార్‌' అని పేరు పెట్టారు. మొత్తం సౌర కుటుంబం అంత పరిమాణంలో ఉన్న ఈ వస్తువు.. అత్యంత ప్రకాశవంతమైన ఎరుపు కాంతిని వెదజల్లుతున్నట్లు గుర్తించారు. అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల బృందం ఈ కీలక ఆవిష్కరణ చేసింది. నాసాకు చెందిన జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ తీసిన తొలి విశ్వానికి సంబంధించిన చిత్రాలను పరిశీలిస్తుండగా.. ఓ రహస్యమైన ఎర్రటి చుక్క వారి దృష్టిని ఆకర్షించింది.

వివరాలు

విశ్వం ఎలా ఆవిర్భవించిందో వివరించే సిద్ధాంతం..

ఈ ఖగోళ వస్తువు భూమికి కోట్లాది కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సెటస్‌ (తిమింగలం) అనే నక్షత్రరాశిలో కనిపించింది.

విశ్వం ఎలా ఆవిర్భవించిందో వివరించే ప్రముఖ సిద్ధాంతమైన బిగ్‌ బ్యాంగ్‌ జరిగిన సుమారు 66 కోట్ల సంవత్సరాల తర్వాత ఇది ఏర్పడి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఈ వింత వస్తువుపై చేసిన పరిశీలనల్లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

ఇది భారీ నక్షత్రాన్ని పోలి ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు తెలిసిన ఏ నక్షత్రం ఉత్పత్తి చేయగల శక్తి కంటే సుమారు 100 బిలియన్‌ రెట్లు ఎక్కువ శక్తిని విడుదల చేస్తోంది.

ఇది నక్షత్రాల కంటే బ్లాక్‌హోల్‌ నుంచి వెలువడే శక్తికి చాలా దగ్గరగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వివరాలు

గెలాక్సీలను అన్వేషిస్తున్న శాస్త్రవేత్తలు..

"మేం ఓ కొత్త రకం ఖగోళ వస్తువును గుర్తించాం. దానికి బ్లాక్‌హోల్‌ స్టార్‌ అని పేరు పెట్టాం" అని ఈ పరిశోధనలో కీలకంగా వ్యవహరించిన డాక్టర్‌ రోహన్‌ నాయుడు తెలిపారు.

ఆయన గతంలో మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన కావ్లీ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఆస్ట్రోఫిజిక్స్‌ అండ్‌ స్పేస్‌ రీసెర్చ్‌లో పనిచేశారు. ప్రస్తుతం హవాయి యూనివర్సిటీలో ఉన్నారు.

"సాధారణంగా బ్లాక్‌హోల్స్‌తో సంబంధం ఉన్నంతటి శక్తిని ఇది వెలువరిస్తోంది.

అదే సమయంలో నక్షత్రాలకు సంబంధించిన కొన్ని లక్షణాలు కూడా ఇందులో కనిపిస్తున్నాయి" అని రోహన్‌ నాయుడు వివరించారు.

జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ సాయంతో విశ్వంలో అత్యంత దూరంలో ఉన్న గెలాక్సీలను శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు

ప్రకాశవంతమైన ఎర్రటి చుక్కపై దృష్టి..

బిగ్‌ బ్యాంగ్‌ జరిగిన కేవలం 28 కోట్ల సంవత్సరాలకే ఏర్పడిన 'Mom-z14' అనే గెలాక్సీని గుర్తించిన తర్వాత.. ఇతర ఖగోళ వస్తువులపై కూడా వారు దృష్టి సారించారు.

'నేచర్‌' జర్నల్‌లో ప్రచురించిన పరిశోధనలో శాస్త్రవేత్తలు తమ పరిశీలనలను వివరించారు.

టెలిస్కోప్‌ చిత్రాల ఆర్కైవ్‌లో అత్యంత ఎరుపు రంగులో కనిపించిన 'MoM-BH-1' అనే అత్యంత ప్రకాశవంతమైన ఎర్రటి చుక్కపై వారు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

"దాని కాంతి దాదాపు పూర్తిగా ఎరుపు రంగులో కనిపించడం, ఒక నిర్దిష్ట తరంగదైర్ఘ్యం కంటే దిగువకు వెళ్లగానే ఒక్కసారిగా అదృశ్యమవడం చాలా అసాధారణంగా ఉంది.

ఇప్పటివరకు తెలిసిన ఏ ఖగోళ వస్తువుతోనూ దీనిని పోల్చలేం" అని రోహన్‌ నాయుడు తెలిపారు.

ADVERTISEMENT